
‘జీవో 49తో ఆదివాసీల మనుగడకు ముప్పు’
పాతమంచిర్యాల: జీవో 49తో ఆదివాసీల మనుగడకు ముప్పు ఉందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ల ఆశయ్య అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్టు భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తడోబా, అందేరీ రిజర్వ్ ఫారెస్టును కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టులో కలుపుతూ కుమురం భీం జిల్లాలోని 339 గ్రామాలను ఖాళీ చేయించేందుకు తీసుకువచ్చిన జీవో 49 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాంతం భారత రాజ్యాంగంలోని 5 వషెడ్యూల్‌లో ఉన్నందున జిల్లాలో గ్రామసభలు నిర్వహించకుండా, ప్రజాభిప్రాయం తీసుకోకుండా, పెసా చట్టం అమలు చేయకుండా జీవో తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. జీవో 49 రద్దు కోసం ఈ నెల 21న (నేడు) చేపట్టిన ఏజెన్సీ బంద్‌కు సీపీఎం మద్దతు ప్రకటిస్తోందన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, జిల్లా కమిటీ సభ్యులు ప్రకాష్, దుంపల రంజిత్, అశోక్, చందు, మల్లీశ్వరి, ఉమారాణి, లింగన్న, ప్రేమ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.