ముగిసిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు

Jul 21 2025 8:09 AM | Updated on Jul 21 2025 8:09 AM

ముగిసిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు

ముగిసిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు

● బాలికల డబుల్స్‌లో రిదిమా దేవినేని, సరయు సూర్యనేని ● బాలుర డబుల్స్‌లో అమన్‌ అనీశ్‌, యూదజిత్‌రెడ్డి ● బాలికల సింగిల్స్‌లో ప్రసన్న బోనం ● బాలుర సింగిల్స్‌లో సాయి నచికేత్‌ విజయం

నిర్మల్‌టౌన్‌: జిల్లా కేంద్రం శివారు కొండాపూర్‌ వద్ద నిర్మల్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో ఈనెల 17న ప్రారంభమైన రాష్ట్రస్థాయి అండర్‌–19 జూనియర్స్‌ బాల, బాలికల బ్యాడ్మింటన్‌ పోటీలు ఆదివారం ముగిశాయి. మంచిర్యాల జిల్లా స్టార్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ముఖేశ్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్‌, రాష్ట్రస్థాయి పోటీల కన్వీనర్లు కిశోర్‌, వన్నెల భూమన్న నేతత్వంలో పోటీలు నిర్వహించారు. 33 జిల్లాల నుంచి 300 మంది క్రీడాకారులు పాల్గొనగా 166 మంది క్వాలిఫై అయ్యారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరయ్యారు. కాసేపు క్రీడాకారులతో సరదాగా బ్యాడ్మింటన్‌ ఆడారు. ముందుగా ఫైనల్‌ మ్యాచ్‌లు నిర్వహించగా.. బాలికల డబుల్స్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన రీదిమ దేవినేని, సరయు సూర్యనేని గెలుపొందారు. రన్నర్లుగా రంగారెడ్డి జిల్లాకు చెందిన చందన గుర్రం, వేదస్వి వాసిరెడ్డి నిలిచారు. బాలుర డబుల్స్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన అమన్‌ అనీశ్‌, యూదజిత్‌రెడ్డి.. సంగారెడ్డి జిల్లాకు చెందిన గిరి వాసన్‌ సర్వానకుమార్‌, సాయి సిద్ధార్థపై గెలుపొందారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో వరంగల్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన శౌర్య కిరణ్‌, రిషిత పాండే.. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు చెందిన అమన్‌ అనీశ్‌, రియా సుశీల్‌పై గెలుపొందారు. బా లికల సింగిల్స్‌లో ఖమ్మం జిల్లాకు చెందిన ప్రసన్న బోనం.. రంగారెడ్డి జిల్లాకు చెందిన రిషిత పాండేపై విజయం సాధించారు. బాలుర సింగిల్స్‌లో సంగారెడ్డి జిల్లాకు చెందిన సాయి నచికేత్‌ బట్రాజ్‌.. వరంగల్‌ జిల్లాకు చెందిన అఖిల్‌రావు సూర్యనేనిపై గెలుపొందారు. విజేతలకు ఎమ్మెల్సీ అంజిరెడ్డి మెడల్స్‌, కప్‌లు అందజేశారు. తెలంగాణ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ నుంచి వచ్చిన 10 మంది ఎంపైర్లు, రిఫరీ, మ్యాచ్‌ కంట్రోలర్‌ను సన్మానించారు.

క్రీడలు అంటే ఎంతో ఇష్టం

చిన్నప్పటి నుంచి తనకు క్రీడలు అంటే ఎంతో ఇష్టమని ఎమ్మెల్సీ అంజిరెడ్డి పేర్కొన్నారు. యుక్త వయసులో కబడ్డీ, బ్యాడ్మింటన్‌ తదితర క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడానికి సహకరించిన నిర్మల్‌ స్పోర్ట్స్‌ అకాడమీకి అభినందనలు తెలిపారు. పీఈటీల వినతి మేరకు స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు. నిర్మల్‌ జిల్లా క్రీడాకారులకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. పోటీల్లో విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ తనవంతుగా స్పోర్ట్స్‌ బ్యాగులు అందజేస్తానని పేర్కొన్నారు. జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి, కోఆర్డినేటర్లు సందీప్‌, మధుకర్‌గౌడ్‌, మహేశ్‌, ప్రణీత్‌, నందకుమార్‌, డాక్టర్లు అవినాష్‌, మనోజ్‌ భరత్‌, పీడీ భోజన్న, దీక్ష కాలేజ్‌ మేనేజ్‌మెంట్‌ వెంకట్‌రెడ్డి, ప్రమోద్‌రావు, పీఈటీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement