
ముల్తానీలు వర్సెస్ అటవీశాఖ
● వివాదాస్పదంగా పోడు భూములు ● మొక్కలు నాటడాన్ని అడ్డుకున్న వైనం ● అటవీ భూములంటున్న అధికారులు ● రెండేళ్లుగా కొనసాగుతున్న పంచాయితీ
ఇచ్చోడ: మండలంలోని సిరిచెల్మ అటవీ పరిధి చెలుకగూడ అటవీప్రాంతంలో కేశవపట్నం, జోగిపేట్ గ్రామాలకు చెందిన ముల్తానీలు సాగు చేస్తున్న వంద ఎకరాల పోడు భూములు వివాదాస్పదంగా మారాయి. టైగర్‌జోన్ పరిధి అటవీప్రాంతంలో విలువైన టేకు చెట్లు నరికివేసి మైదానంగా మార్చి కొందరు అక్రమంగా సాగు చేస్తున్నారని జిల్లా ఉన్నతాధికారులు గుర్తించారు. అటవీ ప్రాంతంలో మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముల్తానీలు అడ్డుకుంటున్నారు. గత రెండేళ్లుగా అటవీశాఖ, ముల్తానీల మధ్య పంచాయితీ కొనసాగుతోంది. పోలీసు బందోబస్తు మధ్య అటవీ అధికారులు మొక్కలు నాటుతుంటే తరచూ అడ్డుకుంటున్నారు. అటవీ, పోలీసు శాఖలకు తలనొప్పిగా మారింది.
తరచూ ఘటనలు
గతేడాది ముల్తానీలు సాగు చేస్తున్న పోడు భూముల్లో అటవీ అధికారులు భారీగా మొక్కలు నాటారు. కొంత మంది ముల్తానీలు ఆ సమయంలో జేసీబీకి నిప్పుంటించడంతో పాక్షికంగా దగ్ధమైంది. పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈనెల 1న పోడు భూముల్లో అధికారులు మొక్కలు నాటేందుకు తవ్విన గుంతలను ముల్తానీలు పూడ్చివేశారు. ఈనెల 5న మొక్కలు నాటేందుకు వెళ్తున్న అటవీ అధికారులను సిరిచెల్మ ఘాట్ రోడ్డు వద్ద అడ్డుకున్నారు. 8 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈనెల 19న అటవీశాఖ అధికారులు మొక్కలు నాటుతున్న ప్రాంతానికి ముగ్గురు మహిళలు అక్కడికి చేరుకుని ఇక్కడి నుంచి మీరు వెళ్లకపోతే కొడవలితో గొంతు కోసుకుంటామని హల్‌చేశారు. పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం మహిళల కుటుంబీకులను పిలిపించి బయటకు పంపే ప్రయత్నంలో ముల్తానీలు పెద్ద ఎత్తున స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు మహిళలను బయటకు పంపించారు. ఆదివారం మొక్కలు నాటే క్రమంలో బందోబస్తు వెళ్లిన పోలీసులపై ముల్తానీలు మూకుమ్మడిగా రాళ్లతో దాడి చేశారు.
ఫుల్‌స్టాప్ పడేదెలా..
అటవీశాఖ, ముల్తానీల మధ్య వివాదాస్పదంగా మారిన అటవీ భూముల విషయంలో ఫుల్‌స్టాప్ పడేవిధంగా కలెక్టర్ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటవీ ప్రాంతంలో చెట్లు నరికివేతకు గురైంది ఎప్పుడు, వాటిలో ముల్తానీలు ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు. వారికి సహకరించింది ఎవరు, వారి వద్ద ఉన్న ఆధారాలు, ముల్తానీల ఆందోళనల్లో రాజకీయ ప్రమేయం ఎంత అన్న కోణంలో జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైన ఉంది.
చర్యలు తీసుకుంటాం
అడవులను అక్రమించి భూములు సాగు చేస్తున్న వారిపై చట్టాపరమైన చర్యలు తీసుకుంటాం. సిరిచెల్మ అటవీ ప్రాంతంలో 50 ఎకరాల వరకు మొక్కలు నాటాం. కొందరు ముల్తానీలు అడ్డుకోవడంతో కొంత ఆలస్యం జరుగుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు తీసుకుంటాం.
– ప్రశాంత్ బాజీరావు
పాటిల్ కధం, ఆదిలాబాద్ డీఎఫ్‌వో