
కౌలురైతు బలవన్మరణం
కుంటాల: కుంటాలకు చెందిన కౌలు రైతు రాజారాం గజేందర్ (49) అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. శనివా రం తెల్లవారుజామున స్థానిక ఉన్నత పాఠశాల సమీపంలోని పంట చేనులో చెట్టుకు ఉరేసుకున్నాడు. ఏఎస్సై జీవన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. గజేందర్ మూడేళ్లుగా 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నాడు. అయితే, ఆశించిన మేర దిగుబడి రావడం లేదు. దీంతో పెట్టుబడి, కౌలు చెల్లింపు కోసం అప్పులు చేశాడు. వచ్చిన దిగుబడి అప్పులు, వడ్డీలకు సరిపోవడం లేదు. ఇప్పటికీ రూ.3.60 లక్షల అప్పు ఉంది. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో ఖరీఫ్ సాగు ఆశాజనకంగా లేదు. దీంతో మనస్తాపం చెందిన గజేందర్ అప్పులు ఎలా తీర్చాలన్న బెంగతో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. గజేందర్ తండ్రి రాజారాం బక్కన్న ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.