
‘21న బంద్ విజయవంతం చేయాలి’
ఆదిలాబాద్‌రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమురం భీం కన్జర్వేషన్ కారిడార్ పేరిట తీసుకువచ్చిన జీవో 49 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న చేపట్టిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ కోరారు. శనివారం మావల మండలంలోని కుమురంభీం గూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1/70, పెసా చట్టాలు ఆదివాసీల అస్తిత్వాన్ని, మనుగడను, హక్కులను ఉల్లంఘిస్తున్నాయన్నారు. అన్నివర్గాల ప్రజలు, వ్యాపారులు, విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, బ్యాంకులు, పెట్రోల్ బంకులు పూర్తిస్థాయిలో బంద్‌కు సహకరించాలని కోరారు. సమావేశంలో తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక, ఉపాధ్యక్షురాలు ఉయిక ఇందిరా, డివిజన్ అధ్యక్షురాలు సోయం లలితా, ఆదిలాబాద్ డివిజన్ ఉపాధ్యక్షుడు ఆత్రం గణపతి, మావల మండల అధ్యక్షుడు వెడ్మ ముకుంద్, ఉపాధ్యక్షుడు తొడసం ప్రకాష్, కుమ్ర వినోద్, తదితరులు పాల్గొన్నారు.
పశువులను తరలిస్తున్న రెండు వాహనాలు పట్టివేత
బెజ్జూర్: అక్రమంగా పశువులు తరలిస్తున్న రెండు వాహనాలను పట్టుకున్నట్లు ఎస్సై సర్దార్ పాషా తెలిపారు. శనివారం ఉదయం బెజ్జూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న రెండు బొలెరో వాహనాలను ఆపి తనిఖీ చేయగా ఒక్కో వాహనంలో ఐదు చొప్పున పశువులు ఉన్నాయని, పెంచికల్‌పేట్ నుంచి చేడ్వాయి వెళ్తున్నట్లు చెప్పారు. పశువైద్యాధికారి, గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా తీసుకెళ్తున్నట్లు గుర్తించామని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.