
ఫోన్ల రికవరీకి ప్రత్యేక బృందం ఏర్పాటు
● ఎస్పీ అఖిల్ మహాజన్ ● పోగొట్టుకున్న 109 సెల్‌ఫోన్లు బాధితులకు అందజేత
ఆదిలాబాద్‌టౌన్: బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి రికవరీ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోగొట్టుకున్న, చోరీకి గురైన రూ.16 లక్షల విలువ గల 109 సెల్‌ఫోన్లను శనివారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని సమావేశం మందిరంలో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫోన్ పోయిన వెంటనే https://www.ceir.gov.in వెబ్‌సైట్‌లో లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 900 సెల్‌ఫోన్లను బాధితులకు తిరిగి అందజేసినట్లు తెలిపారు. మీసేవ కేంద్రాల్లో ఎలాంటి చలాన్లు కట్టకుండా ఫిర్యాదు చేయవచ్చన్నారు. దొంగిలించిన ఫోన్లను కొనుగోలు చేస్తే చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటామని దుకాణాల యజమానులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ డి.వెంకటి, ప్రత్యేక బృందం సభ్యులు ఎస్సై పి.గోపీకృష్ణ, ఎస్.సంజీవ్, ఎంఎ.రియాజ్, మజీద్, తదితరులు పాల్గొన్నారు.