
నా ఎదుగుదలను ఓర్వలేకే దుష్ప్రచారం
● ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
కైలాస్‌నగర్: రాజకీయంగా తన ఎదుగుదలను ఓర్వలేకనే బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పెన్‌గంగా గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మైక్రోఫైనాన్స్‌లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి నిందితుడు పరారైన ఘటనకు సంబంధించి తనపై జరుగుతున్న ప్రచారంపై వివరణ ఇచ్చారు. నిందితుడు తనకు స్నేహితుడేనని, కలిసి చదువుకున్నామన్నారు. అయితే నిందితుడి ఫౌండేషన్‌కు తన ఫౌండేషన్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను ఎమ్మెల్యే కావడం జీర్ణించుకోలేని బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు సోషల్ మీడియా, పత్రికలు, యూట్యూబ్ చానళ్లలో తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు బాధ్యులైన వారికి లీగల్ నోటీసులు జారీ చేయడంతో పాటు ఎస్పీకి ఫిర్యాదు చేస్తానన్నారు. మోసపోయిన గిరిజన యువతకు న్యాయం చేసేలా తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు.