
● జిల్లా కాంగ్రెస్ కమిటీకి కొత్త కార్యవర్గం ● తుది దశక
బలోపేతం దిశగా..
కొత్త నియామకం అయ్యాక డీసీసీలను మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అధి నాయకత్వం అడుగులు వేస్తోంది. డీసీసీ ఇక నుంచి పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడంలో క్రియాశీలకంగా మారనుంది. ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య సమన్వయం చేస్తూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలోనూ క్రియాశీలకంగా మారనుంది. అనుబంధ విభాగాలు, కార్యకర్తలు, సభ్యత్వాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల నాటికి ప్రజల్లో పార్టీని పటిష్టం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అన్నింటిని లెక్కలోకి తీసుకుని నూతన డీసీసీ ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) కసరత్తు తుది దశకు చేరుకుంది. వారం రోజుల్లోనే కొత్తగా జిల్లా కార్యవర్గం కొలువు దీరనుంది. గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు కొత్తగా నియామకం కోసం పరిశీలనలు, వడపోతలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలో డీసీసీలో ఎవరికి చోటు ఎలా ఉండబోతున్నదనే అంశంపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఐదేళ్ల కాలానికి జిల్లా అధ్యక్ష పదవి, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శి, కోశాధికారితోపాటు జిల్లా కార్యవర్గ సభ్యులను నియమించాల్సి ఉంది. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షురాలుగా కొక్కిరాల సురేఖ ఉన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉండి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలోనే జిల్లా బాధ్యతలు చేపట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయి. జిల్లా అధికార పార్టీలో ‘గడ్డం’ ఫ్యామి లీకి మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్సార్ మధ్య వైరం కొనసాగుతోంది. మంచిర్యాల నియోజకవర్గం ఒక వైపు, బెల్లంపల్లి, చెన్నూర్ ఎమ్మెల్యేలు వినోద్, మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ మరోవైపు అన్నట్లుగా కేడర్ వీడిపోయి ఉంది. దీంతో ఎవరికి వారే అన్నట్లుగా ఉంటున్నారు. మరోవైపు ఇప్పటికే ఉమ్మడి జిల్లా పార్టీ సంస్థాగత నిర్మాణ బాధ్యులు అనిల్‌యాదవ్ ఇటీవల జిల్లాలో పర్యటించి వెళ్లారు. పార్టీ పరిశీలకులు ఇక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. జిల్లా నుంచి మంత్రి వివేక్ ఉండడంతో ఈసారి డీసీసీ ఎంపిక ఎలా ఉండబోతుందనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది.
సామాజిక తూకం, నిబంధనలు..
జిల్లా కమిటీల ఎంపికపై రాష్ట్ర నాయకత్వం క్షుణ్ణంగా పరిశీలనలు చేస్తోంది. ఈ క్రమంలో సామాజిక తూకం పాటించనున్నారు. ఆయా జిల్లాల్లో రొటేషన్ చూస్తే జిల్లాకు ఏ వర్గానికి అధ్యక్ష పీఠం దక్కుతుందోననే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతమున్న డీసీసీ అధ్యక్షురాలును మారిస్తే తమకు అవకాశం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. బీసీ, ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గాల నుంచి దరఖాస్తులు వెళ్లాయి. డీసీసీ అధ్యక్ష పదవికి బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి నాతరి స్వామి, కర్కూరి రామ్‌చందర్, తొంగల మల్లేశ్, చెన్నూర్ నియోజకవర్గం నుంచి రఘునాథ్‌రెడ్డి దరఖాస్తులు ఇచ్చారు. ప్రధాన కార్యదర్శి, ఇతర పదవుల్లోనూ తమకు అవకాశం కల్పించాలని పలువురు కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలను కలుస్తూ తమకు జిల్లా పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని విన్నవిస్తున్నారు. ఇక గ్రామ, మండల, జిల్లా స్థాయి ఎన్నికల్లో టికెట్ ఆశించే నాయకులు పార్టీ పదవులకు దూరంగా ఉంటున్నారు.