
కేంద్రీయ విద్యాలయం దూరం.. భారం
● బస్సులు తక్కువ.. విద్యార్థులు ఎక్కువ ● పరిమితికి మించి ప్రయాణం ● గంటల తరబడి నిల్చుండాల్సిందే..!
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల నుంచి గుడిపేట సొంత భవనంలోకి మార్చిన కేంద్రీయ విద్యాలయం విద్యార్థులకు దూరభారంగా మారింది. అందులో చదివే పిల్లలందరూ సీసీసీ, శ్రీరాంపూర్, క్యాతన్‌పల్లి, మంచిర్యాలకు చెందిన వారే కావడంతో రవాణా ఇబ్బంది ఎదురవుతోంది. ఆర్టీసీ ఉదయం క్యాతన్‌పల్లి, శ్రీరాంపూర్ నుంచి రెండు బస్సులు నడిపిస్తోంది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం, బస్సుల సంఖ్య తక్కువ కావడంతో రద్దీ ఏర్పడుతోంది. ఒక్కో బస్సులో 130నుంచి 140మంది విద్యార్థులు పరిమితికి మించి ప్రయాణం చేయాల్సి వస్తోంది. శ్రీరాంపూర్ నుంచి సీసీసీ, షిర్కే, ఐబీ మీదుగా వచ్చేసరికి పాఠశాల సమయం దాటిపోతోంది. తల్లిదండ్రులు ఎక్కడపడితే అక్కడ ఆపాలంటూ హుకుం జారీ చేయడంతో ఆర్టీసీ డ్రైవర్లు పెదవి విరుస్తున్నారు. పాఠశాల సమయానికి బస్సు రాకుంటే విద్యార్థుల చదువులపై ప్రభావం పడుతోంది.
బస్సుల కొరత
మంచిర్యాలలో ఆర్టీసీ బస్సుల కొరత ఏర్పడుతోంది. డిపోలో 145బస్సులు ఉండగా ఇందులో 44 హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటాయి. 60 అద్దెబస్సులు కాగా మిగతా 23 ఆయా రూట్లలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ఏ ఒక్క రూట్‌ను రద్దు చేసినా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పాఠశాల సమయంలో ఆయా రూట్లలో బస్సులు నడపడం తప్పనిసరిగా మారింది. కేంద్రీయ విద్యాలయానికి రెండు బస్సులు సర్దుబాటు చేయగా.. కిక్కిరిసిన పిల్లలతో నడపడం వల్ల ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది.
ఇలా చేస్తే మేలు..
కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థుల సంఖ్యను బట్టి ఆయా రూట్లలో నాలుగు బస్సులు కూడా సరిపోయేలా లేవు. చిన్నపిల్లలు కావడంతో 55 నుంచి 60 మందికి మించి వెళ్లడం ప్రమాదకరం. ఇంకోవైపు పుస్తకాల బ్యాగులు, టిఫిన్ బాక్సులతో గంటల తరబడి నిల్చోవడమూ కష్టతరమే. సింగరేణి, దేవాపూర్ వంటి ఇతర సంస్థల్లో ప్రయాణికులు, పాఠశాలల విద్యార్థులను చేరే వేసేందుకు ప్రత్యేకంగా ఒప్పంద ప్రాతిపదికన బస్సులను నడిపిస్తున్నాయి. ఆయా అధికారులకు కాంట్రాక్టు పద్ధతిన వాహనాలు సమకూర్చుంటున్న విధంగా కేంద్రీయ విద్యాలయానికి ప్రత్యేకంగా టెండర్లు పిలిచి బస్సులు ఏర్పాటు చేస్తే విద్యార్థులకు భద్రతతోపాటు ఉపయోగకరంగా మారుతుంది. విద్యార్థులు పాఠశాల సమయానికి చేరుకునేందుకు అవకాశం ఉంటుందని పలువురు సూచిస్తున్నారు.