
నారుమడి తడారి.. పత్తి వడలి..
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఆశించిన వర్షాలు లేక నారుమడులు తడారి పోతున్నాయి. మరోవైపు ఆలస్యంగానైనా విత్తుకున్న పత్తి ఎదుగుదల లేక మొక్కలు వడలిపోతున్నాయి. రెండ్రోజులుగా జిల్లాకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటిస్తున్నా మబ్బులు పడుతూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షానికే పరిమితం అవుతోంది. వరినారును బతికించుకునేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. ట్యాంకులతో నీరు తీసుకొచ్చి తడులు అందిస్తున్నారు. వర్షం కురుస్తుందనే ఆశతో ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు బతికించుకునే మార్గం లేక నారుమడుల్లో పశువులను వదిలేస్తున్నారు. పచ్చని పంటలతో కళకళలాడాల్సిన పొలాలు పడావుగా మారుతున్నాయి. వరినాట్లు, కలుపుతీత, తదితర పనులు లేక రైతులు, కూలీలు ఇతర పనులకు వెళ్తున్నారు. జిల్లాలో సాధారణ వర్షపాతం 371.4 మిల్లీమీటర్లు కాగా ఇప్పటివరకు 192.3 మిల్లీమీటర్లు కురిసింది. జిల్లా సగటున 48శాతం లోటు నెలకొంది. చెన్నూర్, నస్పూర్, వేమనపల్లి మండలాల్లో అత్యధిక లోటు వర్షపాతం, మిగతా 15 మండలాల్లో 20 నుంచి 58శాతం లోటు నెలకొంది. గతేడాది ఈ సమయంలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. గతేడాది జూలై 21 వరకు జిల్లాలో 416.9. మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 14శాతం అధికంగా కురిసింది. అన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే అధికంగా నమోదైంది. ఈ ఏడాది వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి నష్టపోయే పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు.

నారుమడి తడారి.. పత్తి వడలి..