
ప్రచారం భళా.. ప్రభుత్వ ‘కళ’శాల
● సర్కారు కాలేజీల్లో పెరిగిన అడ్మిషన్లు ● ముందున్న మంచిర్యాల, లక్సెట్టిపేట
మంచిర్యాలఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈసారి ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పెరిగాయి. ప్రవేశాల సంఖ్య పెంచాలనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధ్యాపకులు గ్రామాల్లోకి వెళ్లి ముమ్మర ప్రచారం నిర్వహించారు. వేసవి సెలవులకు ముందే ఆయా పాఠశాలలకు వెళ్లి ప్రభుత్వ కళాశాలల్లో చేరడం, పదో తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులకు బోధన తీరు, మౌలిక వసతుల కల్పన, సౌకర్యాలపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్‌లు, అధ్యాపకులు శ్రమించడంతో కళాశాలలు కళకళలాడుతున్నాయి. జిల్లాలో పది ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. ప్రైవేటుకు దీటుగా మారి విద్యాబోధన చేస్తున్నాయి. ఎప్‌సెట్, నీట్, జేఈఈ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులను ప్రత్యేక బోధనతో ప్రోత్సహిస్తున్నారు. అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 2067మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఇందులో 1367మంది జనరల్, 700 ఒకేషనల్‌లో చేరారు. లక్సెట్టిపేట ప్రభుత్వ కళాశాలలో గత ఏడాది ప్రథమ సంవత్సరంలో 169మంది ఉండగా ఈ ఏడాది 416మంది విద్యార్థులు చేరారు. నూతన భవనం, ల్యాబ్, డ్యూయల్ డెస్క్ అధునాతన హంగులతో భవనం నిర్మించగా అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. కార్పొరేట్‌కు దీటుగా కళాశాల ఉండడంతో సెకండియర్ చదువుతున్న 50మంది ప్రైవేటు కళాశాలల నుంచి టీసీలు తీసుకొచ్చి చేరారు. మంచిర్యాల ప్రభుత్వ కళాశాలలో 426, బెల్లంపల్లిలో 416 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మిగతా కళాశాలల్లో 100కు పైగా విద్యార్థులు చేరగా, జైపూర్, జన్నారం, దండేపల్లి కళాశాలల్లో 100లోపు అడ్మిషన్లు ఉన్నాయి. నెలాఖరుకు అడ్మిషన్లకు అవకాశం ఉండడంతో మరింతగా పెరిగే వీలుంది.
సమష్టి కృషితోనే..
సమష్టి కృషితో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పెరిగాయి. నెలాఖరు వరకు అడ్మిషన్లకు అవకాశం ఉంది. మరో 300 మందికి ప్రవేశాలు కల్పించేందుకు కృషి చేస్తాం. ఆధునిక హంగులతో నిర్మించిన కళాశాలకు ఊహించని రీతిలో విద్యార్థుల అడ్మిషన్లు పెరిగాయి. ప్రభుత్వ కళాశాలలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు నమ్మకం కలిగింది. బైపాస్ రోడ్‌లో ఏర్పాటు చేస్తున్న ప్రైవేట్ కళాశాలకు అనుమతులు లేకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అనుమతి లేని కళాశాలల్లో విద్యార్థులు చేరొద్దు.
– డీఐఈవో అంజయ్య, మంచిర్యాల