
గ్రామాల అభివృద్ధికి సమష్టిగా కృషి
మంచిర్యాలఅగ్రికల్చర్: గ్రామ పంచాయతీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, జెడ్పీ సీఈవో గణపతిలతో కలిసి అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల భవనాల్లో మరమ్మతులకు నివేదిక రూపొందించాలని, సంక్షేమ వసతిగృహాలను సందర్శించి ఒక రోజు అక్కడ నిద్రించాలని, మండల ప్రత్యేక అధికారులు పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో పంట సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభించేలా, బిల్లుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
కోటపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కోటపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాల, కేజీబీవీ సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, తాగునీరు, వంటశాల, భోజనశాల, వసతిగృహం, పడకలు, మూత్రశాలలు పరిశీలించారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ మోనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. బడి మానేసిన పిల్లలను గుర్తించి తల్లిదండ్రులతో మాట్లాడి తిరిగి పాఠశాలలో చేర్పించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. పాఠశాలలో కిటికీలు, మూత్రశాలలు, ఫ్యాన్లు ఇతరత్రా మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి నాగేశ్వర్‌రెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

గ్రామాల అభివృద్ధికి సమష్టిగా కృషి