
‘ప్రాదేశిక’ ఎన్నికలకు అడుగులు
● జిల్లాలో 129 ఎంపీటీసీ స్థానాలు ● 16 జెడ్పీటీసీ, 16 ఎంపీపీ స్థానాలు ● బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ(ఎంపీటీసీ) స్థానాల సంఖ్య ఖరారైంది. గత ఎన్నికల్లో 132 స్థానాలు ఉండగా ప్రస్తుతం 129 ఎంపీటీసీ స్థానాలుగా లెక్క తేలింది. 2024 జూన్ 2తో పాలకవర్గాల పదవీ కాలం ముగిసి ఏడాది కావడంతో అభివృద్ధి, పరిపాలన పరంగా నిధుల కేటాయింపులు జరగాలంటే ప్రాదేశిక ఎన్నికలు తప్పనిసరిగా మారాయి. జిల్లాలో 129 ఎంపీటీసీ స్థానాలు, 16 జెడ్పీటీసీ, 16 ఎంపీపీ స్థానాలు ఖరారు కాగా పంచాయతీల్లో ఓటరు జాబితా అనుసరించి ఎన్నికలు నిర్వహించనున్నారు. మహిళా ఓటర్లు 1,94,688 మంది, పురుష ఓటర్లు 1,94,039 మంది, ఇతర ఓటర్లు 19 మందితో మొత్తం 3,84,746 మంది ఓటర్లు ఉన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన మేరకు పంచాయతీ రాజ్ చట్టంలో చట్టబద్ధతకు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్‌కు ఆమోదం లభిస్తే మరో వారం రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రాదేశిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదేమైనా ప్రాదేశిక ఎన్నికలకు అడుగులు పడుతుండగా ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసుకుని ఉన్న అధికారులు ఎన్నికల కమిషన్ నుంచి ఎప్పుడు ప్రకటన వచ్చినా నిర్వహణకు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు జరిగి పాలకవర్గాలు కొలువుదీరితే కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తాయనడంలో సందేహం లేదు.