
బైండోవర్‌కు ససేమిరా
● నచ్చజెప్పిన అధికారులు ● ఒప్పుకోని గిరిజనులు
దండేపల్లి: మండలంలోని మాకులపేట గ్రామ పంచాయతీ పరిధి రామునిగూడెంకు చెందిన కొంతమంది ఆదివాసీ గిరిజన మహిళలు లింగాపూర్ అటవీ బీట్‌పరిధిలోని 380 కంపార్ట్‌మెంట్ అటవీ భూముల్లో గత కొద్ది రోజులుగా చెట్ల పొదలు తొలగించి విత్తనాలు విత్తుతున్నారు. కొందరిపై అటవీశాఖ అధికారులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. బుధవారం విత్తనాలు విత్తుతుండగా 21మంది గిరిజన మహిళలను బైండోవర్ కోసం అదుపులోకి తీసుకుని దండేపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. బైండోవర్‌కు ఒప్పుకోబోమని గిరిజన మహిళలు భీష్మించుకు కూర్చున్నారు. ఇప్పటికే కేసులు నమోదు చేశారని, ఇంకా బైండోవర్ ఎందుకని అధికారులను ప్రశ్నించారు. తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే, ఎస్సై తహాసీనొద్దీ న్, అటవీశాఖ అధికారులు, ఆదివాసీ సంఘాల నాయకులు గిరిజన మహిళలతో మాట్లాడారు. బైండోవర్‌కు ఒప్పుకోవాలని నచ్చజెప్పినా వారు వినిపించుకోలేదు. సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 7.30గంటల వరకు తహసీల్దార్ కార్యాలయం వద్దనే నిరీక్షించి చీకటిపడ్డాక ఇళ్లకు వెళ్లిపోయారు.