
వానాకాలం ఆయకట్టు ఖరారు
● యాక్షన్ ప్లాన్ ప్రకటించిన సాగునీటి శాఖ ● ఉమ్మడి జిల్లాలో ఇంకా పూర్తిగా నిండని ప్రాజెక్టులు ● వానలు లేకపోతే ఆయకట్టు ప్రశ్నార్థకమే
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాజెక్టుల ఆయకట్టు కింద వానాకాలంలో సాగయ్యే వివరాలను సాగునీటి శాఖ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర స్థాయి ఇంజినీర్ల కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈసారి పలు చోట్ల వర్షాలు తక్కువగా కురవడంతో ప్రాజెక్టుల్లోకి ఇంకా సరిపడా నీరు రాలేదు. దీంతో ప్రాజెక్టుల్లోకి నీరు వచ్చాకే సాగునీటి శాఖ అధికారులు ఆయకట్టు ప్రతిపాదించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని సదర్మాట్, నిర్మల్ పరిధిలోని గడ్డెన్నవాగు, ఎస్సారెస్పీ (సరస్వతి కాలువ), మంచిర్యాల జిల్లా గొల్లవాగు, ర్యాలీ వాగు, నీల్వాయి ప్రాజెక్టులకు, ఆసిఫాబాద్ జిల్లాలోని ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టులను మరోసారి సమీక్షించి ఆయకట్టును ప్రకటించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఒక్క కుమురంభీం ప్రాజెక్టు నిల్వ ఆశాజనంగా ఉంది. మరోవైపు వర్షాలు కురిస్తేనే ఈ ప్రాజెక్టుల కింద రైతాంగానికి ఊరట కలగనుంది.