
పస్తులుంటున్నా పట్టించుకుంటలేరు..
● మోదీ గారు ఇండియాకు రప్పించండి ● కువైట్‌లో మండల వాసి నరకయాతన ● సోషల్ మీడియాలో వీడియో వైరల్
జన్నారం: ‘ప్రధాని మోదీ సార్ మూడు రోజుల నుంచి తిండి లేదు. పోలీసుస్టేషన్‌కు వచ్చిన సార్.. పోలీసులు పట్టించుకుంట లేరు. రెండేళ్ల క్రితం కువైట్ పోయిన.. రెండు నెలల నుంచి జీతాలు ఇస్తలేరు.. తిండి లేదు, ఇంటికి పంపడం లేదు.. ఎండలు చాలా కొడుతున్నాయి.. సార్ నన్ను కాపాడండి..’ అంటూ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన గొర్రె శాంతయ్య ప్రధానిని వేడుకుంటూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శాంతయ్య ఉపాధి కోసం రెండేళ్ల క్రితం కువైట్ దేశం వెళ్లి కూలీ గా పని చేస్తున్నాడు. రెండు నెలలుగా యజమాని జీతం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. జీతం రాకపోవడంతో తిండికి గోసైతందని, ఇండియాకు పంపివ్వమంటే పాస్‌పోర్టు ఇవ్వడం లేదని తెలిపాడు. ఈ విషయాన్ని అక్కడి పోలీసులకు చెప్పడానికి వెళ్తే మూడు రోజులుగా తిప్పించుకుంటున్నారని, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అబుసుల్తాన్ అనే వ్యక్తి పాస్‌పోర్టు ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడని, తన నంబరును బ్లాక్‌లిస్టులో పెట్టాడని, రెండు నెలలుగా వేరేచోట పని చేయగా.. వారూ వెళ్లగొట్టారని పేర్కొన్నాడు. ప్రధాని మోదీ, తెలంగాణ ప్రభుత్వం ఇండియాకు రప్పించాలంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.
శాంతయ్యను రప్పించండి: కుటుంబీకులు
శాంతయ్యను ఇండియాకు రప్పించాలని ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు గొర్రె శంకరయ్య, లక్ష్మీ, భార్య ప్రమీల, కుమారుడు సాయితేజ, కూతురు వైష్ణవి వేడుకుంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్నామని, తమ కొడుకు ఏడుస్తూ వేడుకుంటుంటే తట్టుకోలేక పోతున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

పస్తులుంటున్నా పట్టించుకుంటలేరు..