
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
మంచిర్యాలటౌన్: జిల్లావ్యాప్తంగా సీజనల్ వ్యాధులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీశ్‌రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని హమాలీవాడలో బస్తీ దవాఖానాను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీటకజనిత వ్యాధులు, మలేరియా, డెంగీ, చికెన్‌గున్యా, డయేరియా వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో 52,749 మంది మహిళలకు పరీక్షలు చేశామని, ఇతర మహిళలు కూడా వైద్య పరీక్షలు చేసుకునేలా ప్రోత్సహించాలని అన్నారు. సీజనల్ వ్యాధుల్లో దోమలు వృద్ధి చెందకుండా ప్రతీ శుక్రవారం డ్రైడే పాటించేలా స్థానికులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి రమ్య, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు.