
జంక్షన్ల కూల్చివేత
● రోడ్డు వెడల్పులో భాగంగా తొలగింపులు ● మూణ్నాళ్ల ముచ్చటగా మారాయనే చర్చ
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రం మంచిర్యాలలోని వెంకటేశ్వర థియేటర్, లక్ష్మీ టాకీస్ చౌరస్తాలోని జంక్షన్లను మంగళవారం కూల్చివేశారు. గత ప్రభుత్వ హయాంలో వెంకటేశ్వర థియేటర్, లక్ష్మీ టాకీస్, ఐబీ, బెల్లంపల్లి చౌరస్తాల్లో రూ.4కోట్లతో నాలుగు జంక్షన్లు నిర్మించారు. ఏప్రిల్‌లో ఐబీ చౌరస్తా జంక్షన్ ఎత్తు, వ్యాసార్థం తగ్గించి అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రోడ్లు చిన్నగా ఉండి జంక్షన్లు పెద్దగా ఉన్నాయని వాటి నిర్మాణ సమయంలో ప్రజలు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఐబీ చౌరస్తా నుంచి శ్రీనివాసగార్డెన్ వరకు ఆరు వరుసలుగా రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రోడ్డు వెడల్పు చేస్తుండగా.. ఆయా జంక్షన్లు అడ్డుగా ఉన్నాయని లక్ష్మీటాకీస్ చౌరస్తా, వెంకటేశ్వర థియేటర్ చౌరస్తాల్లోని రెండు జంక్షన్లను మంగళవారం పూర్తిగా కూల్చేశారు. కూల్చివేతను ఓ యువకుడు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. రూ.కోట్లు ఖర్చు చేసి ఎందుకు నిర్మించారు, ఎందుకు కూల్చివేస్తున్నారని ప్రొక్లెయినర్‌కు అడ్డుగా వెళ్లాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని.. మద్యంమత్తులో ఉండడంతో వదిలిపెట్టారు. కాగా, ప్రణాళిక లేకుండా పనులు చేపట్టడం వల్ల ప్రజాధనం వృథా మారిందని, జంక్షన్లు మూణ్నాళ్ల ముచ్చటగా మారాయనే చర్చ జరుగుతోంది.