
‘ఉపాధి’ వేతనాలేవి..!
● మూడు నెలలుగా పెండింగ్
● ఇబ్బందుల్లో ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లు
పాతమంచిర్యాల: ‘అసలే తక్కువ వేతనానికి పని చేస్తున్నాం. నెల జీతం కూడా నెలనెల రాకపోతే మా కుటుంబాలను ఎలా పోషించుకునేది. పిల్లల ఫీజులు, కిరాణా సామగ్రికి అప్పులు చేయాల్సి వస్తోంది..’ అంటూ జిల్లాలోని ఉపాధి హామీ పథకం సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు ఏప్రిల్, మే, జూన్ నెలల వేతనాలు విడుదల కాలేదు. జిల్లాలోని పీవోలు 41మంది, ఏపీవోలు 13మంది, ఈసీలు 12మంది, టెక్నిక ల్ అసిస్టెంట్లు 81మంది, హెచ్‌ఆర్, ప్లాంటేషన్ మేనేజర్, అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ డిసేబుల్ కోఆర్డినేటర్ ఒక్కొక్కరు, క్లస్టర్ లెవల్ లైవ్‌లీహుడ్ రిసోర్స్ సెంటర్‌పర్సన్లు ఇద్దరు, అటెండర్లు 10మంది, ఫీల్డ్ అసిస్టెట్లు 155మంది, కంప్యూటర్ ఆపరేటర్లు 41మందికి మే, జూన్ నెలలకు సంబంధించిన వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన స్పర్శ్ సాఫ్ట్‌వేర్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల వేతనాలు విడుదల కావడం లేదని అధికారులు చెబుతున్నారు. సాఫ్ట్‌వేర్‌లోని లోపాలు సరి చేయడానికి నెలల సమయం తీసుకోవడం సరికాదని ఉద్యోగులు అంటున్నారు. ఉద్యోగుల జీతాల బడ్జెట్ కోసం ప్రభుత్వానికి ప్రతీ నెల ప్రతిపాదనలు పంపిస్తున్నామని, నిధులు విడుదల కాగానే చెల్లిస్తామని డీఆర్డీవో ఎస్.కిషన్ తెలిపారు.