
రైతులకు అండగా ప్రభుత్వం
● ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ● కడెం ఎడమ కాలువకు నీటి విడుదల
కడెం: రైతులకు రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. కడెం ప్రాజెక్టు ఎడమ కాలువకు ప్రాజెక్టు ఈఈ విఠల్, ఏఎంసీ చైర్మన్ భూషణ్‌తో కలిసి మంగళవారం సాగునీరు విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు ఖరీఫ్ పంటలు వేసుకోవాలని సూచించారు. కడెం ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, తాము అధికారంలోకి వచ్చాక రూ.9.46 కోట్లతో వరద గేట్లు మరమ్మతుల చేయించామని తెలిపారు. ఇటీవలే రూ.33.5 లక్షలతో ఎడమ కాలువ మరమ్మతులు చేపట్టామన్నారు. త్వరలో ప్రాజెక్టులో పూడికను తొలగిస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టు రోడ్డుకు మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మండలంలోని పెద్దూర్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం కాలనీలో సెప్టిక్ ట్యాంక్ పనులు ప్రారంభించారు. నచ్చన్‌ఎల్లాపూర్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోలార్ ఫెన్సింగ్ పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేశ్, జిల్లా నాయకుడు సతీశ్‌రెడ్డి, నచ్చన్‌ఎల్లాపూర్ మాజీ సర్పంచ్ గంగన్న, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శకుంతల, జన్నారం డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.