
ఉరేసుకుని ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య!
● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
ఇంద్రవెల్లి: మండలంలోని సమాక గ్రామ పంచాయతీ పరిధిలోని రాముగూడ అటవీప్రాంతంలో ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉట్నూర్ సీఐ మడావి ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు రాముగూడలో కొలాం గిరిజన తెగకు చెందిన టెకం బాపురావ్, చిన్నిబాయి దంపతులకు లక్ష్మీబాయి, రాజు, జంగు, టెకం ఆయు(30) అలియాస్ అరుణ సంతానం. ఐదేళ్లక్రితం తల్లిదండ్రులు మృతి చెందగా ఆయు(అరుణ) ట్రాన్స్‌జెండర్‌గా వేషం మార్చి గుడిహత్నూర్ మండలంలోని అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఈ నెల 8న ఇచ్చోడకు చెందిన స్నేహితుడు జాదవ్ అర్జున్‌తో కలిసి రాముగూడకు వచ్చాడు. పంటచేను వద్దకు వెళ్లి సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. అనంతరం ఆయు కనిపించకుండా పోయాడు. 9న సాయంత్రం జాదవ్ అర్జున్ రాముగూడకు వచ్చి ఆయు చేనులో ఉరేసుకున్నాడని కుటుంబ సభ్యులకు చెప్పాడు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే 10న మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న తోటి ట్రాన్స్‌జెండర్లు జాదవ్ అర్జున్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ఈ నెల 13న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉట్నూర్ సీఐ మడావి ప్రసాద్ సోమవారం తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీయించి పంచనామా నిర్వహించారు. గ్రామ పటేల్ టేకం రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఉరేసుకుని ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య!