
విస్తరిస్తున్న డెంగీ
మంచిర్యాలటౌన్: జిల్లాలో డెంగీ కేసులు విస్తరిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిలో దోమలు పెరిగి వ్యాధులు ప్రబలుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ రికార్డుల్లో 12 డెంగీ కేసులు, రెండు మలేరియా కేసులు నమోదయ్యాయి. లక్సెట్టిపేట మండలంలో 2, మందమర్రిలో 3, బెల్లంపల్లిలో 3, మంచిర్యాల పట్టణంలోని హైటెక్‌సిటీ కాలనీలో 1, తాండూరులో 1, మరో ఇద్దరికి డెంగీ పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రజలకు వైద్య పరీక్షలు చేయడంతోపాటు ఆయా ప్రాంతాల్లో దోమల మందు పిచికారీ చేయిస్తున్నారు. ఇప్పటికే జ్వరాల బారిన పడిన వారి రక్త నమూనాలు సేకరించి టీహబ్‌కు పంపిస్తున్నారు.
ప్రబలుతున్న వైరల్ ఫీవర్లు
చెన్నూర్: చెన్నూర్ మున్సిపాల్టీతోపాటు చెన్నూర్, కోటపల్లి మండలాల్లో వైరల్ ఫీవర్లు ప్రబలుతున్నాయి. జ్వరాలు, జలుబు, దగ్గుతో చెన్నూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు బావులు, బోర్లలో కొత్త నీరు చేరింది. నీటి వనరులు, బావులు, ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయకపోవడంతో వ్యాధుల బారిన పడాల్సి వస్తోంది. గ్రామాల్లో డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో రోడ్లపై గుంతల్లో నీరు నిలిచి బురదగా మారుతున్నాయి. కాలనీలు, గుంతలు, డ్రెయినేజీ నీటిలో దోమలు వృద్ధి చెందుతున్నాయి. దోమల నివారణ మందు పిచికారీ చేయించాలని ప్రజలు కోరుతున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతీ శుక్రవారం డ్రై డే నిర్వహించాలని, ఇళ్ల ఆవరణలో నీరు నిలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెన్నూర్ సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డి.సత్యనారాయణ తెలిపారు.
జిల్లాలో 12 కేసులు నమోదు
అప్రమత్తమైన వైద్య, ఆరోగ్యశాఖ

విస్తరిస్తున్న డెంగీ