
కడెం ఆయకట్టుకు సాగునీరు
● నేడు విడుదల చేయనున్న ఎమ్మెల్యే బొజ్జు ● ఖరీఫ్ పంటలకు భరోసా.. ● సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు
కడెం: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు కింద సాగుచేసిన ఖరీఫ్ పంటలకు సాగునీరు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. జలాశయంలో నీటిమట్టం ఆశాజనకంగా ఉండడంతో మంగళవారం ఉదయం నీటిని విడుదల చేయనున్నారు. గతేడాది జూలై 14న ప్రా జెక్టు నీటిమట్టం 683.625 అడుగులు ఉండగా, ఈ ఏడాది 694.600 అడుగులకు చేరడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. తాజాగా అధికారులు ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మంగళవారం నీటిని విడుదల చేస్తారని ప్రాజెక్టు ఈఈ విఠల్ తెలిపారు.
కాలువ మరమ్మతు పూర్తి..
కడెం ప్రాజెక్టు ఎడమ కాలువకు రూ.33.5 లక్షలతో కడెం, దస్తురాబాద్ మండలాల పరిధిలో 16 కిలోమీటర్ల మేర ఇటీవల మరమ్మతు పనులు చేపట్టారు. పిచ్చిమొక్కలు, చెత్త, పూడికను తొలగించి, దెబ్బతిన్న కాలువలను బాగు చేశారు. ఈ మరమ్మతులతో కాలువ శుభ్రమై, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందనుంది.
రైతుల్లో ఉత్సాహం..
కడెం ప్రాజెక్టు కాలువల ద్వారా వానాకాలం సీజన్‌లో కడెం, దస్తురాబాద్, జన్నారం, దండేపల్లి, హాజీపూర్, లక్సెట్టిపేట మండలాల పరిధిలోని 68,150 ఎకరాలకు సాగునీరు అందుతుంది. గతేడాదికన్నా ముందుగానే నీటిని విడుదల చేస్తుండడంతో సాగు జోరందుకోనుంది.
చివరి ఆయకట్టు వరకు
వానాకాల పంటల సాగుకు కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు సాగు నీరందిస్తాం. ప్రాజెక్టులో ఆశాజనకంగా నీటిమట్టం ఉండడంతో సాగునీటిని వదలాలని నిర్ణయించాం. ఇంకా రెండు నెలలు వర్షాలు కురుస్తాయి. మంచి వర్షాలు కురిస్తే యాసంగి పంటలకు కూడా నీరు అందించే అవకాశం ఉంటుంది.
– విఠల్, ప్రాజెక్టు ఈఈ

కడెం ఆయకట్టుకు సాగునీరు