
రుయ్యాడిలో ముగిసిన మొహర్రం వేడుకలు
● అధికసంఖ్యలో తరలివచ్చిన భక్తులు ● కిటకిటలాడిన హస్సేన్ హుస్సేన్ దేవస్థానం
తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడిలో హస్సేన్ హుస్సేన్ దేవస్థానంలో ఏర్పాటు చేసిన పీరీలకు రాష్ట్రంలోనే ప్రత్యేకత ఉంది. ఇక్కడి పీరీలు మహిమగలవని భక్తుల నమ్మకం. సోమవారం చివరిరోజు మొహర్రం వేడుకలకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భారీగా తరలివచ్చారు. దీంతో దేవస్థానం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సందర్శించి పీరీలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా మొహర్రం వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రామస్తులను అడిగి పీరీల విశిష్టతను తెలుసుకున్నారు. సాయంత్రం దేవస్థానం ఎదుట ఉన్న గుండం చుట్టూ డప్పువాయిద్యాలతో తిరుగుతూ అసైదులా హారతి అంటూ ఆటలు ఆడారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు నిర్వాహకులు అన్నదానం చేశారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ అధికారులు జిల్లా కేంద్రం నుంచి రుయ్యాడి గ్రామానికి ప్రత్యేక బస్సులు నడిపారు. కార్యక్రమంలో విజయ డెయిరీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి, మాజీ జెడ్పీటీసీ గోక గణేశ్‌రెడ్డి, నాయకులు జీవన్‌రెడ్డి, గంగాధర్, సుదర్శన్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, సీసీవో శ్రీనివాస్, గంగన్న, దత్తాత్రి, తదితరులు పాల్గొన్నారు.

రుయ్యాడిలో ముగిసిన మొహర్రం వేడుకలు