
పాఠశాలల్లో మరమ్మతు పూర్తిచేయాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ● ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష
ఉట్నూర్‌రూరల్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సెలవులు ముగియకముందే మరమ్మతు పూర్తిచేయాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాల డీఈలు, ఏఈలతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో, ఏజెన్సీ గ్రామాల్లో చేపడుతున్న మరమ్మతులు ఎంతవరకు పూర్తి చేశారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న గేట్లను, ఆర్వో ప్లాంట్ల మరమ్మతు చేయించాలని సూచించారు. భోజనశాలల భవనాల షెడ్ల నిర్మాణాలు వెంటనే పూర్తిచేయాలన్నారు. అదనపు తరగతి గదులు నిర్మించాలని, అంగన్‌వాడీ మోడల్ స్కూల్, మరుగుదొడ్లు, సెప్టిక్ ట్యాంక్, డార్మంటరీ గదుల మరమ్మతు పూర్తి చేయాలని ఆదేశించారు. పీహెచ్‌సీల్లో గదుల నిర్మాణాలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఈఈ తానాజీ, డీఈ శివప్రసాద్, ఏఈలు పాల్గొన్నారు.