
అవినీతి రహిత పాలనే లక్ష్యం
● బాల్క సుమన్ హయాంలో ఇసుక దందా ● చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి
రామకృష్ణాపూర్: చెన్నూర్ నియోజకవర్గంలో అవినీ తి రహిత పాలన అందించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. బాల్క సుమన్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండగా ఇసుక దందా విచ్చలవిడిగా సాగిందని, తాను గెలుపొందిన తర్వాత ఇసుక దందాకు అడ్డుకట్ట వేశామని అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భీమా గార్డెన్స్‌లో సోమవారం నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. కేసీఆర్ తనకు తన కొడుకు, కూతురికి ఫామ్‌హౌజ్‌లు కట్టించారు తప్ప ప్రజలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. సింగరేణిలో లక్ష ఉద్యోగాలు ఉంటే బీఆర్‌ఎస్ పాలనలో 60 వేల ఉద్యోగాలు పోయాయని అన్నారు. ఏడాదిన్నర పాలనలో చెన్నూర్ నియోజకవర్గంలో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా బాల్క సుమన్ పదేళ్లు ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని అన్నారు. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, పార్టీ పరిశీలకులు జంగా రాఘవరెడ్డి, రామ్‌భూపాల్, పీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు పాల్గొన్నారు.