● నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ ● రాష్ట్ర వ్యాప్తంగా 15 బ్యాచ్‌లు ● ఉమ్మడి జిల్లాలో 1,450 మందికి తర్ఫీదు | - | Sakshi
Sakshi News home page

● నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ ● రాష్ట్ర వ్యాప్తంగా 15 బ్యాచ్‌లు ● ఉమ్మడి జిల్లాలో 1,450 మందికి తర్ఫీదు

Apr 28 2025 12:06 AM | Updated on Apr 28 2025 12:06 AM

● నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ ● రాష్ట్ర వ్యాప్తంగా 1

● నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ ● రాష్ట్ర వ్యాప్తంగా 1

కెరమెరి(ఆసిఫాబాద్‌): విద్యావ్యవస్థలో నూతనంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేందుకు గిరిజన సంక్షేమశాఖ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గిరిజన విద్యార్థులకు ఏఐ(ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్సీ) ద్వారా విద్యాబోధన అందించాలని భావించింది. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీడీఏ పరిధిలోని ప్రాథమిక, ఆశ్రమోన్నత పాఠశాలల్లో ఎంపిక చేసిన ఉపాధ్యాయులు, సీఆర్టీలు, అకాడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లకు నేటి నుంచి ఆన్‌లైన్‌ మాధ్యమంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు 15 బ్యాచ్‌లను తయారు చేశారు. ఒక్కో బ్యాచ్‌కు 350 నుంచి 400 మంది టీచర్లు క్లాసులు వినేలా ప్రణాళికలు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూర్‌ ఐటీడీఏ పరిధిలోని ఉపాధ్యాయులు ఈ నెల 26, 28 తేదీల్లో ఏఐటూల్స్‌పై శిక్షణ పొందనున్నారు. ఇప్పటికే జిల్లా పరిషత్‌ లోకల్‌ బాడి పాఠశాలల్లో ఎంపిక చేసిన 3, 4, 5వ తరగతుల విద్యార్థులకు ఏఐ విద్య కొనసాగుతుండగా కొంతమార్పు వచ్చింది. రీడింగ్‌, రైటింగ్‌ స్కిల్స్‌ పెరిగాయి. గణితంలోనూ లెక్కలు చేయగలుగుతున్నారు. ఇదే తరహాలో గిరిజన ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఏఐ విద్యాబోధన అందించాలని గిరిజన సంక్షేమశాఖ సంకల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి మే 30 వరకు ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,560 మంది ఉపాధ్యాయులు ఏఐపై శిక్షణ తీసుకోనుండగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూర్‌ ఐటీడీఏ పరిధిలో గల 1,450 మంది ఆన్‌లైన్‌ వేదికగా ఆన్‌లైన్‌ శిక్షణలో పాల్గొననున్నారు.

ఉమ్మడి జిల్లాకు 26, 28 తేదీల్లో..

రాష్ట్రవ్యాప్తంగా 15 బ్యాచ్‌లను తయారు చేయగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ ఐటీడీఏ పరిధిలోని ఉపాధ్యాయులకు మే 26న 13వ బ్యాచ్‌లో ఆదిలాబాద్‌, నిర్మల్‌, 28న 14వ బ్యాచ్‌లో కుమురం భీం, మంచిర్యాల జిల్లాల ఉపాధ్యాయులకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు ఆరు సెషన్‌లలో సబ్జెక్టుల వారీగా తరగతులు కొనసాగుతాయి.

సిగ్నల్స్‌ లేక.. పాఠాలు వినక

కోవిడ్‌ కారణంగా అనేక మంది విద్యార్థులు చదువులో వెనుకబడి పోయారు. ఐటీడీఏ పరిధిలోని ఆన్‌లైన్‌ బోధనలకు అవరోధాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి జిల్లాలో అనేక ప్రాంతాల్లో సిగ్నల్స్‌ లేకపోవడంతో చాలామంది ఆన్‌లైన్‌ తరగుతులకు దూరమయ్యారు. కొన్నిచోట్ల సిగ్నల్స్‌ ఉన్నప్పటికీ డేటా సరిపోక పోవడంతో మధ్యలోనే అంతరాయం ఏర్పడేది. చివరకు ఏపాఠం చెబుతున్నారో.. తామేం వింటున్నమో అనేంతగా విద్యార్థుల్లో గందర గోళం ఏర్పడింది. గత అనుభభవాలను దృష్టిలో పెట్టుకుని సిగ్నల్స్‌కు అంతరాయం లేకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఆసిఫాబాద్‌లోని గిరిజన ఆశ్రమోన్నత పాఠశాల

ఐటీడీఏ పరిధిలోని గిరిజన పాఠశాలలు, ఉపాధ్యాయుల వివరాలు

రెగ్యులర్‌ ఉపాధ్యాయులు : 878

అకాడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లు : 26

సీఆర్‌టీలు : 528

ఉన్నత పాఠశాలలు : 126

ప్రాథమిక పాఠశాలలు : 950

శిక్షణలో పాల్గొనాలి

నేటికాలంలో ఏఐ విద్యాబోధన విద్యార్థులకు ఎంతో ఆవశ్యకమైంది. కాలానుగుణంగా బోధనలో మార్పులు తేవడానికి గిరిజన సంక్షేమ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఐటీడీఏ పీవో ఆదేశానుసారంగా మేలో కొనసాగే ఏఐ టూల్స్‌ పై ఎంపిక చేసిన ఉపాధ్యాయులు శిక్షణలో పాల్గొనాలి. విద్యారంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవాలి.

– పుర్క ఉద్దవ్‌, ఏసీఎంవో, కుమురంభీం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement