
‘గొల్లవాగు’ అడుగంటుతోంది..
● డెడ్‌స్టోరేజీకి చేరువలో ప్రాజెక్టు నీటిమట్టం ● ఆందోళన చెందుతున్న రైతులు ● రబీలో 6వేల ఎకరాల్లో సాగు
భీమారం: చెన్నూర్ నియోజకవర్గంలోని భీమారం, చెన్నూర్ మండలాలకు సాగునీరు అందించే గొల్ల వాగు ప్రాజెక్ట్ అడుగంటుతోంది. వేసవిలో ఎండల తీవ్రతకు రోజురోజుకు నీటిమట్టం పడిపోతోంది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 155.500 మీటర్లు కాగా ప్రస్తుతం 150.000 మీటర్లు మాత్రమే నీరు నిల్వ ఉంది. నీటిమట్టం 148.00 మీటర్లకు పడిపోతే డెడ్‌స్టోరేజీకి చేరినట్లే. దీంతో మరో నెల రోజులపాటు పంట పొలాలకు నీరందుతుందో లేదోనని రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రాజెక్ట్ కింద 9,500 ఎకరాల ఆయకట్టు ఉండగా రబీ సీజన్‌లో 6వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
అవగాహన కల్పించని అధికారులు
పంటల సాగుకు ముందే వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల అధికారులు గ్రామాలకు వెళ్లి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉంది. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రాజెక్ట్ కింద మే నెల చివరి వరకు సాగు కొనసాగుతోంది. ఖరీఫ్, రబీ పంటలను ఎప్పుడు ప్రారంభించాలో రైతులకు తెలియడం లేదు. దీంతో సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా వరినాట్లు వేస్తున్నారు. దీనితో సాగునీటి సమస్య ఎదురవుతోంది.
రెండు నెలలపాటు నీటి విడుదల
అవసరం లేకున్నా వర్షాకాలం పంటలో రెండు నెలలపాటు కాలువ నిండా నీటిని వదలడంతో వృథా అయ్యాయని రైతులు ఆరోపిస్తున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసినా ఇరిగేషన్ శాఖ అధికారులు కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగించారని, నిలిపివేసి ఉంటే ఇప్పుడు ప్రాజెక్ట్‌లో భారీగా నీరు ఉండేదని పేర్కొంటున్నారు. అధికారుల వైఖరి కారణంగానే ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీకి చేరుకుందని అన్నదాతలు ఆరోపిస్తున్నారు.