
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఓట్ల లెక్కింపునకు పూర్తి స్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని, స్ట్రాంగ్ రూం వద్ద కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి.సంతోష్ తెలిపారు. శనివారం ఆయన ఎన్నికల పరిశీలకులు బిశ్వజిత్ దత్తా, సజ్జన్ ఆర్, కౌంటింగ్ పరిశీలకులు సిద్ధ లింగయ్య, బెల్లంపల్లి ఆర్వో, అదనపు కలెక్టర్ రాహుల్, చెన్నూర్ ఆర్వో సిడాం దత్తులతో కలిసి ముల్కల్లలోని ఐజా ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ సూపర్‌వైజర్లు, సూక్ష్మ పరిశీలకులు, సిబ్బందికి నిర్వహించిన శిక్షణలో పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కిపు పకడ్బందీగా చేపట్టనున్నామని తెలిపారు. మొత్తంగా ఓట్ల లెక్కింపులో 300 మంది సిబ్బంది పాల్గొంటున్నారని అన్నారు. అభ్యర్థుల నుంచి నియామకమైన ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరుగుతుందని అన్నారు. లెక్కింపు కేంద్రం పరిసరాల్లో సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, లెక్కింపు కేంద్రంలోకి ఎన్నికల సంఘం నిబంధనలకు మేరకు గుర్తింపు కార్డు ఉన్న వారిని అనుమతిస్తామని పేర్కొన్నారు. లెక్కింపు హాల్‌లోకి మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధమని, ఏజెంట్లు లెక్కింపు అధికారులకు సహకరించాలని అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎన్నికల ప్రవర్తనా నియామవళి మేరకు చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
మూడంచెల భద్రత
మంచిర్యాలక్రైం: కళాశాలలోని లెక్కింపు కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ పరిశీలకుడు ఆర్.ఇలాంగో, రామగుండం సీపీ రెమారాజేశ్వరితోపాటు మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్‌కేకన్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. లెక్కింపు కేంద్రం మొత్తం మూడంచెల భద్రత పరిధిలో ఉంది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు 144సెక్షన్ అమలులో ఉంటుందని రామగుండం పోలీసు కమిషనర్ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరం వరకు ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండకూడదని తెలిపారు. 300 మంది పోలీసు సిబ్బందితో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 100 మంది సీఆర్‌పీఎఫ్ బలగాలు, కేంద్రం బయట 100 మంది ఏఆర్ పోలీసు, రహదారులపై మరో వంద మంది సివిల్ పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. లెక్కింపు కేంద్రంలో మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ ఏసీపీలతోపాటు జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, సీఆర్‌పీఎఫ్, ప్రత్యేక పోలీస్ బలగాలు, జిల్లా పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొననున్నారు.
జిల్లా ఎన్నికల అధికారి సంతోష్
