జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ (సర్)పై బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓట్లు గల్లంతు కాకుండా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఉండి సర్‌పై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. సభ్యత్వ నమోదును యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని.. వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టారని ఫ్రెండ్లీ పోలీస్‌తో నేరాలు నియంత్రణ చేసినట్లు తెలిపారు. అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై అన్నివర్గాలు అసంతృప్తిలో ఉన్నాయన్నారు. ఇచ్చిన హామీల అమలు కోసం మనం ఒత్తిడి తీసుకురావాలన్నారు. సభ్యత్వ నమోదులో అన్నివర్గాలను భాగస్వామ్యం చేయాలని, రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వం నియోజకవర్గంలో మహబూబ్‌నగర్ చేరేలా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని సభ్యత్వ నమోదు సమయంలో ప్రజలకు వివరించాలన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చెప్పాలన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క నాయకుడు.. కార్యకర్తలు పని చేయాలన్నారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్‌లు వాల్యానాయక్, వెంకటేశ్వర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు శివరాజ్, నాయకులు దేవేందర్‌రెడ్డి, కరుణాకర్‌గౌడ్, రెహమాన్, ఆంజనేయులు, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.


