ఏటీఎంనే ఎత్తుకెళ్లారు | - | Sakshi
Sakshi News home page

ఏటీఎంనే ఎత్తుకెళ్లారు

May 27 2026 10:14 AM | Updated on May 27 2026 10:14 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: ‘కొన్నిరోజుల నుంచి రెక్కీ నిర్వహించారు.. ఏటీఎం దగ్గర సెక్యూరిటీ లేదు.. తెల్లవారుజామున సరైన పెట్రోలింగ్‌ ఉండటం లేద’ని గుర్తించి.. ఏటీఎం ఎత్తుకెళ్లేందుకు పథకం రచించి.. పక్కాగా అమలు చేసి సఫలమయ్యారు. ఏటీఎం మిషన్‌కే ఎత్తుకెళ్లడం పాలమూరులో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌ నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన తెలంగాణ చౌరస్తాలో ఎస్‌బీఐ ఏటీఎంను మంగళవారం తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు రాబరీ చేశారు. మొదట ఒక వ్యక్తి పరిసర ప్రాంతాలు పరిశీలించడానికి అక్కడికి చేరుకొని.. చుట్టు పక్కలతోపాటు రోడ్డు మార్గాన్ని పూర్తిగా గమనించిన తర్వాత మరో ఇద్దరికి సమాచారం ఇచ్చాడు. బొలెరో వాహనంలో ఇద్దరు వ్యక్తులు పక్క సందు రోడ్డులో నుంచి అక్కడికి చేరుకున్నారు. క్షణాల్లో వాహనం రివర్స్‌ చేసి ఏటీఎం దగ్గరకు పెట్టి ఆ తర్వాత గ్యాస్‌ కట్టర్‌తో మొత్తం కట్‌ చేసి.. వంద కేజీల బరువు కలిగిన ఏటీఎం మిషన్‌ను పట్టా సహాయంతో వాహనం లోపలికి ఎక్కించారు. అక్కడి నుంచి వేగంగా బోయపల్లి గేట్‌ మీదుగా టంకర గ్రామ శివారులో వ్యవసాయ పొలంలోకి చేరుకున్నారు. అక్కడ వాహనంలో నుంచి మిషన్‌ కిందకు దించి కట్టర్‌తో మిషన్‌ను కట్‌ చేసి లోపల ఉన్న రూ.2,37,500 నగదు ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ జానకి, ఏఎస్పీ ఎన్‌బీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. దొంగల ముఠా గాలింపు కోసం మూడు బృందాలు ఏర్పాటు చేశారు. ఏటీఎం రాబరీ కేసులో టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో 331–క్లాజ్‌ 4, 305 బీఎన్‌ఎస్‌ సెక్షన్స్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఇజాజుద్దీన్‌ వెల్లడించారు.

షాద్‌నగర్‌లో విఫలయత్నం

మహబూబ్‌నగర్‌ తెలంగాణ చౌరస్తాలో ఎస్‌బీఐ ఏటీఎం దొంగతనం చేసిన ముఠానే ఈ నెల 23న షాద్‌నగర్‌లో ఒక ఏటీఎంలో దొంగతనం చేయడానికి ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. దీంతోపాటు ఎల్లారెడ్డిపేట సర్కిల్‌ పరిధిలో ఒక ఏటీఎం దోచేశారు. అదే తరహాలో మహబూబ్‌నగర్‌లో చేసి విజయవంతం అయ్యారు.

చివరగా ఐదేళ్ల కిందట..

2019లో వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బిస్లారి గేట్‌ దగ్గర ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో దొంగతనం జరిగింది. అప్పట్లో రూ.6 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఏటీఎంల దగ్గర రాత్రివేళలలో ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడంతో దొంగతనాలు చేయడానికి సులువుగా ఉంటుంది. నగరంలో ప్రధాన బ్యాంకులకు సంబంధించి దాదాపు 50 వరకు ఏటీఎంలు ఉంటాయి. ఏ ఒక్క దగ్గర కూడా సెక్యూరిటీ లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.

8 నిమిషాల్లో పూర్తి

ఎస్‌బీఐ ఏటీఎం దొంగతనం చేయడానికి వచ్చిన ఈ ముఠా కేవలం 8 నిమిషాల్లో పని చేసుకొని అక్కడి నుంచి పరార్‌ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎంతో రద్దీగా ఉండే ఈ రోడ్డు మార్గంలో వాహనదారులు కూడా గుర్తించలేకపోయారు. ఏటీఎం దొంగతనం చేసిన దృశ్యాలు మొత్తం ఎదురుగా ఉన్న గురురాఘవేంద్ర సూపర్‌ మార్కెట్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్‌ కావడంతో పోలీసులు పుటేజీని పరిశీలించారు. అలాగే తెలంగాణ చౌరస్తా, అంబేడ్కర్‌ చౌరస్తా, సింధు హోటల్‌ ఏరియాలో ఉన్న లాడ్జిలలో దొంగలు బస చేశారా అనే విషయంపై పోలీసులు ఆరా తీసినా ఎలాంటి ఫలితం కనిపించలేదు.

తెలంగాణ చౌరస్తాలో ఎస్‌బీఐ ఏటీఎం మిషన్‌ చోరీ

గ్యాస్‌ కట్టర్‌, పట్టా సహాయంతో బొలెరోలోకి ఎక్కించి తీసుకెళ్లిన వైనం

మిషన్‌లో ఉన్న రూ.2,37,500 నగదు మాయం

Advertisement
 
Advertisement
Advertisement