● ‘సాక్షి’ కథనానికి స్పందించిన అధికారులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని పలు పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని, పూర్తిస్థాయిలో అనుమతులు లేకుండా నడిపిస్తున్నారని, అయినా మండల విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ‘సాక్షి’ దినపత్రికలో మంగళవారం ‘ఎడ్యుకేషన్.. కరప్షన్’ అనే కథనాన్ని ప్రచురితం చేసింది. దీనికి స్పందించిన విద్యాశాఖ అధికారులు గుర్తింపులేని పాఠశాలలు, రెన్యువల్ చేయని పాఠశాలలు, ఒకే పేరుతో పలు బ్రాంచ్‌లను నిర్వహిస్తున్న పాఠశాలలను గుర్తించారు. ఆయా పాఠశాలలకు బుధవారం ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్ ఆధ్వర్యంలో షోకాజ్ నోటీసులు అందజేశారు. కాగా.. జిల్లాకేంద్రంలోని ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలను హబీబ్‌నగర్‌లో నిర్వహిస్తున్నారు. అయితే ఈ పాఠశాలకు ఒకే బ్రాంచ్‌కు అనుమతి ఉండగా.. మరో రెండు బ్రాంచ్‌లను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీటికి విద్యాశాఖ అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేవని, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించినందుకు నోటీసులిచ్చి... ఏడు రోజుల్లోగా పూర్తి సమాధానం చెప్పాలని ఆదేశించారు. అలాగే ఏఆర్ యూపీ స్కూల్ కూడా జిల్లాకేంద్రంలోని హబీబ్‌నగర్‌లో నిర్వహిస్తున్నారు. దీనికి పూర్తిస్థాయిలో అనుమతులు లేవని అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇందులో సదరు పాఠశాలకు గుర్తింపు కేవలం 2014–15 విద్యాసంవత్సరం నుంచి 2024–25 విద్యాసంవత్సరం వరకు మాత్రమే అనుమతులుండగా... ఎలాంటి రెన్యువల్ లేకుండా పాఠశాలను కొనసాగిస్తున్నారు. హబీబ్‌నగర్‌లో జీనియస్ మైండ్ స్కూల్‌కు కూడా ఎలాంటి అనుమతులు లేవు. బోధించే ఉపాధ్యాయులు, తరగతి గదులు, మైదానం, ఇతర వసతులు పూర్తి స్థాయిలో లేకుండా నిర్వహించడంపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.


