83 శాతం గ్రౌండింగ్‌ సాధించాం: కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

83 శాతం గ్రౌండింగ్‌ సాధించాం: కలెక్టర్‌

May 21 2026 12:38 AM | Updated on May 21 2026 12:38 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ఉపాధి హామీ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్‌ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి ఆయన వీసీ నిర్వహించారు. అర్హులైన ప్రతి కార్మిక కుటుంబానికి పని దినాలు పెంచే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఖుష్బూగుప్తా మాట్లాడుతూ మార్చి నెలలో గ్రామ సంఘ భవనాల నిర్మాణాన్ని మిషన్‌మోడ్‌లో ప్రారంభించామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల కోసం జిల్లాలో మొత్తం 269 గ్రామ సంఘ భవనాలను విజయవంతంగా గ్రౌండింగ్‌ చేసినట్లు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో మంజూరైన పనుల విషయంలో వేతన, మెటీరియల్‌ కంపోనెంట్‌ పురోగతిని నిత్యం సమీక్షిస్తూ, ఎన్ని పనులు గ్రౌండింగ్‌ దశకు చేరుకున్నాయి, ఎన్ని బేస్‌మెంట్‌ స్థాయికి చేరుకున్నాయనే అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో పని చేయడం వల్లే 83 శాతం గ్రౌండింగ్‌ సాధించగలిగామని కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, డీఆర్‌డీఓ నరసింహులు, ఎంపీడీఓలు శ్రీనివాస్‌రావు, కరుణశ్రీ, మంజుల, ఉమాదేశి, మున్సిపల్‌ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement