వయోపరిమితి పెంపుతో లాభమే | - | Sakshi
Sakshi News home page

వయోపరిమితి పెంపుతో లాభమే

May 21 2026 12:14 AM | Updated on May 21 2026 12:14 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడే అభ్యర్థుల వయో పరిమితిని ప్రభుత్వం 10 ఏళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడాన్ని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు స్వాగతిస్తున్నాయి. ఈ క్రమంలో వయో పరిమితితో పాటు రిజర్వేషన్ల ఆధారంగా వచ్చే వయో పరిమితి దీనికి అదనంగా ఉంది. అయితే కేవలం ఈ పరిమితి ఒక్క సంవత్సరం మాత్రమే వర్తంచడం వల్ల మేలు పెద్దగా జరగకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. తక్కువ నోటిఫికేషన్లు ఇవ్వడం ఇచ్చిన వాటిలో తక్కువ పోస్టులతో ఇస్తుండడం వల్ల ప్రయోజనం ఉండదని, ఎక్కువ నోటిఫికేషన్లు, ఎక్కువ పోస్టులు ఇవ్వాలని పలువురు నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 25 వేల మందికి పైగా విద్యార్థులు ప్రతి ఏడాది పట్టభద్రులవుతున్నారు. వీరితో పాటు గతంలో డిగ్రీతో పాటు, బీఈడీ, బీపెడ్‌ వంటి ప్రొఫిషనల్‌ కోర్సులు చదివిన విద్యార్థులు సుమారుగా 65 వేల మందికి పైగా ఉన్నారు. 44 ఏళ్ల వరకు వయో పరిమితి పెరిగిన నేపథ్యంలో ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఉద్యోగాల కోసం కోచింగ్‌ సెంటర్లకు వెళ్లేవారికి ఆర్థికంగా భారంగా మారతుంది. ఒక్క మహబూబ్‌నగర్‌ జిల్లా మినహా మిగతా జిల్లాలో స్టడీ సర్కిళ్లు లేవు. వాటిని ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.

పోటీ పెరుగుతుంది.

ప్రభుత్వం పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయో పరిమితిని 10 ఏళ్లు పెంచడం మంచి విషయం అయినప్పటికీ, దీంతో ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడతారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి నిరుద్యోగులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదు. ఎక్కువ సంఖ్యలో పోస్టులు వేస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది.

– రవితేజ, ఏబీవీపీ, పీయూ అధ్యక్షుడు

సంవత్సరం నిబంధన వద్దు

ప్రభుత్వం ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతుంది. అలా కాకుండా వయో పరిమితి పెంపును పొడగించే విధంగా చర్యలు తీసుకోవాలి.

– రాము, ఎస్‌ఎఫ్‌ఐ , పీయూ అధ్యక్షుడు

ప్రభుత్వ ఉద్యోగాల్లో అభ్యర్థులకు 10 ఏళ్లు పెంపు

ఒకే సంవత్సరం వర్తిస్తుందన్న ప్రభుత్వం

పదేళ్లు సడలింపు ఉండాలంటున్న నిరుద్యోగులు

ఉమ్మడి జిల్లాలోప్రతి ఏడాది పట్టభద్రులవుతున్న

25 వేల మంది విద్యార్థులు

Advertisement
 
Advertisement
Advertisement