యువకుడి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్యాయత్నం

May 21 2026 12:14 AM | Updated on May 21 2026 12:14 AM

ప్రేమపెళ్లి విఫలం అవుతుందనే భయంతో..

గుళికల మందుతాగి ఇన్‌స్ట్రా గ్రామ్‌లో పోస్టు

అప్రమత్తమైన కుటుంబ సభ్యులు.. ఆస్పత్రికి తరలింపు

చిన్నచింతకుంట: ప్రేమపెళ్లి విఫలమవుతుందేమోననే భయంతో ఓ యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడి.. ఆ విషయాన్ని ఇన్‌స్ర్ట్రాగామ్‌లో పోస్టు చేసిన ఘటన కౌకుంట్ల మండలం తిర్మలాపురంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్వ నవీన్‌, దాసర్‌పల్లికి చెందిన ఓ యువతిని కొన్నిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈనెల 15న సోమశిల వద్ద శివాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అదేరోజు తమకు రక్షణ కల్పించాలని భూత్పూర్‌ పోలీస్‌ష్టేషన్‌లో సీఐ రామకృష్ణను కలిశారు. 17న తిర్మలాపురం గ్రామానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు 19న తిర్మలాపురంలో పంచాయితీ పెట్టారు. పంచాయితీలో యువతి భద్రతకు నవీన్‌ కుటుంబం కొంత స్థిరాస్థిని రాసివ్వాలని వారు డిమాండ్‌ చేశారు. దీనికి నవీన్‌ కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఆమెను వారి కుటుంబసభ్యులు దాసర్‌పల్లికి తీసుకెళ్లారు. అయితే నవీన్‌ తన భార్యను వారి కుటుంబసభ్యులు బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపిస్తూ చిన్నచింతకుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు యువతిని ఆమె తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దీంతో వారు రెండురోజుల సమయం కోరినట్లు ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డి తెలిపారు. తన భార్యకు మాయమాటలు చెప్పి తన దగ్గరకు రానివ్వరేమోన్న మనోవేదనతో నవీన్‌ బుధవారం సీసీకుంట మండలంలోని అల్లిపురం సమీపంలో గుళికలమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ ఫొటోలను ఇన్‌స్ర్ట్రాగాంలో పోస్టు చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు లొకేషన్‌ యాప్‌ ద్వారా ఘటనా స్థలానికి చేరుకొని నవీన్‌ను ఆత్మకూర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి వనపర్తి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం నవీన్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నవీన్‌ తండ్రి సురేష్‌ ఫిర్యాదు మేరకు యువతి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement