ఈతకు వెళ్లిన యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లిన యువకుడు మృతి

May 21 2026 12:14 AM | Updated on May 21 2026 12:14 AM

ధన్వాడ: మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం ఎదుట ఉన్న మెట్లబావిలో ఈతకు వెళ్లిన యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసముంటున్న మున్నా(27) హమాలీ పనుల చేసేవాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈతకొట్టేందుకు బావికి వచ్చాడు. ఈతకొడుతూ నీటిలో మునిగిపోయాడు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఫైర్‌ సిబ్బంది సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా 3: 30 గంటల సమయంలో మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. యువకుడు మద్యం తాగి ఈత కొట్టడంతోనే మృతి చెందినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేష్‌గౌడ్‌ తెలిపారు.

జడ్చర్లలో ఓ విద్యార్థి..

జడ్చర్ల: ఈతకు వెళ్లి ఓ విద్యార్థి దుర్మరణం చెందిన ఘటన బుధవారం మండల పరిధిలోని పెద్ద ఆదిరాల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన నాగేశ్‌ (17) గ్రామ శివారులో గల గుండుబావిలో మిత్రులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో బావిలో దూకి పైకి రాలేదు. దీంతో తోటి మిత్రులు వెంటనే విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. గ్రావమస్తులు బావిలో దూకి గాలించినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది బావిలో దూకి నీటి అడుగున ఉన్న విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీశారు. నాగేశ్‌ ఇంటర్‌ చదువుతున్నాడని, తండ్రి రమేశ్‌బాబు ఆర్టీసీలో పనిచేస్తున్నట్లు తెలిపారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

వాగులో పడి యువకుడు మృతి

కొత్తపల్లి: మండల పరిధిలోని మన్నాపూర్‌ గ్రామానికి చెందిన వడ్డె శివకుమార్‌ (19) అనే యువకుడు బుధవారం వాగులో పడి మృతి చెందాడు. గ్రామ సమీపంలోని వాగులో కాలకృత్యానికి వెళ్లి కాళ్లు కడుక్కునే సమయంలో కాలు జారి వాగులో పడి పోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మరణించాడు. అటుగా వెళ్తున్న వారు చూసి గ్రామస్తులకు సమాచారం అందించడంతో యువకుడి మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. యువకుడి తల్లి ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మద్దూరు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ప్రధాన ఆస్పత్రికి పంపించా రు. ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement