‘ప్రజాపాలనలో మహిళలకు రక్షణ కరువు’ | - | Sakshi
Sakshi News home page

‘ప్రజాపాలనలో మహిళలకు రక్షణ కరువు’

May 21 2026 12:14 AM | Updated on May 21 2026 12:14 AM

జడ్చర్ల: ప్రజాపాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, పట్టపగలు ఉన్మాదులు పెట్రేగిపోతున్నారని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రభుత్వ తీరు, సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం జడ్చర్లలో ఇటీవల ప్రేమోన్మాది దాడిలో మృతిచెందిన బండి వైష్ణవి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పాలమూరు బిడ్డ సీఎంగా ఉన్నాడంటూ గొప్పలు చెప్పుకుంటున్న సొంత జిల్లా జడ్చర్ల నడిబొడ్డున యువతిపై ప్రేమోన్మాది పట్టపగలు కత్తితో దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు పర్యవేక్షణ, శాంతిభద్రతలు ఎక్కడున్నాయన్నారు. షీ టీమ్‌లు ఏమాయ్యయని, సీసీ కెమెరాలు జాడలేకుండా పోయావని ఆరోపించారు. ఫలితంగా ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ మైనర్‌ బాలికపై పలుమార్లు లైంగికదాడి చేసిన ఘటన నుంచి కోలుకోకముందే బండి వైష్ణవిని దారుణంగా హత్య చేయడం తమను కలిచివేసిందన్నారు. నిందితుడు కేంద్రమంత్రి కుమారుడు గనుక పోలీసులు కేసును నీరుగారుస్తున్నారని విమర్శించారు. బాధిత బాలికను కనీసం సీఎం రేవంత్‌రెడ్డి తదితర ప్రభుత్వ పెద్దలు పరామర్శించిన పాపాన పోలేదన్నారు. పైగా ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి నిందితుడికి మద్దతుగా మాట్లాడడం శోచనీయమన్నారు. బీజేపీ ఐటీసెల్‌ విభాగం బాధిత బాలికకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వీరిపై డీజీపీ వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బండి సంజయ్‌ నైతిక బాధ్యత వహించి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ పాలన కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. నిందితులకు శిక్షపడేంతవరకు పోరాడుతామన్నారు. బీజేపీలో ఉన్న మహిళా నేతలు డీకే అరుణ, స్మృతిఇరానీ, నిర్మలాసీతారామన్‌, మాధవిలత, బంగారు శృతి, రచనరెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నించారు. మహిళల ధన, మానప్రాణాలకు రక్షణ కల్పించడంలో సీఎం విఫలమాయ్యరన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్‌ చైర్మన్‌ యాదయ్య, నాయకులు రామ్మోహన్‌, శ్రీను, ఇమ్ము, నాగిరెడ్డి, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement