జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని, అధికారులు జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఎంపీ, దిశ చైర్మన్ డీకే అరుణ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వ నిధులు, రాష్ట్ర వాటా నిధులతో అమలుచేస్తున్న కేంద్ర పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా సంబంధిత శాఖల అధికారులు బాధ్యత వహించాలన్నారు. పథకాలు, కార్యక్రమాల అమలులో లోపాలు ఉంటే సవరించుకొని ఎవరికి చేరాలో వారికి లబ్ధి జరిగినప్పుడు లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఈ సందర్భంగా గత సమావేశంలో చర్చించిన అంశాలపై ఆయా శాఖలు తీసుకున్న చర్యలపై చర్చించారు. జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాకు రూ.2.40 కోట్లు కేటాయించగా.. రూ.1.89 కోట్లు విడుదలయ్యాయని, ఇందులో రూ.1.35 కోట్లు ఖర్చు చేసి గ్రూప్‌లు, వ్యక్తిగతంగా వ్యవసాయ పరికరాలు రెంట్, కస్టమ్ హైరింగ్ కేంద్రాల ద్వారా అందచేశామని డీఏఓ వెంకటేష్ తెలిపారు. దీనిపై ఎంపీ స్పందిస్తూ వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో వచ్చిన దరఖాస్తుల నుంచి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని, పెద్ద రైతులకు కాకుండా.. చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. యూరియా, ఎరువులు తగ్గించి సహజ వ్యవసాయం ప్రోత్సహించేందుకు నేషనల్ మిషన్ మిషన్ ఫర్ నేషనల్ ఫార్మింగ్ కింద 20 క్లస్టర్లలో 2,500 ఎకరాలు, క్లస్టర్‌కు 125 ఎకరాల్లో 2,500 మంది రైతులు ఈ సంవత్సరం సహజ వ్యవసాయం ద్వారా వరి, మొక్కజొన్న, కూరగాయలు రైతులు పండిస్తున్నట్లు చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన కమ్యూనిటీ సోక్ పిట్స్ వెంటనే పూర్తిచేయాలన్నారు. భారత్‌మాల రోడ్డు మహబూబ్‌నగర్ నగర పరిధిలో అలైన్‌మెంట్ మార్చడంతో స్థానికులు వ్యతిరేకిస్తున్నారని, అలైన్మెంట్ రెవెన్యూ, ఎన్‌హెచ్ అధికారులు సర్వే చేసి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్‌కు సూచించారు. మున్సిపాలిటీలలో అమృత్ కింద చేపట్టిన పనులు, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులపై సమీక్షించి, వీటి పురోగతిపై స్థానిక ఎంపీగా తనకు సమాచారం అందించాలని, 15వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చిన మిగిలిన నిధులతో పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. పిస్తాహౌస్ నుంచి పాలకొండకు వెళ్లే దారిలో ఫ్రెష్‌మీట్ వద్ద డివైడర్ తొలగించారని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
● చేవెళ్ల ఎంపీ, దిశ కోచైర్మన్ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ గండేడ్, ముహమ్మదాబాద్ మండలాల్లో నీటి సమస్య లేదని, ఆయిల్‌పాం సాగుపై ఆదర్శ రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా ఉద్యాన అధికారికి సూచించారు. గండేడ్ మండలం సల్కర్‌పేట పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని, వెంటనే క్షేత్రస్థాయిలో మైనింగ్ అధికారులు పర్యటించి అరికట్టేలా చూడాలన్నారు.
● కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ దిశ సమావేశంలో శాఖల వారీగా చర్చించిన అంశాలపై సంబంధిత శాఖల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, ఆయా శాఖలు అమలు చేస్తున్న కార్యక్రమాలు లక్ష్యం మేరకు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే పనులు ప్రారంభించినప్పుడు ప్రోటోకాల్ తప్పక పాటించాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్‌నాయక్, హరిప్రియ, మేయర్ మమత, తదితరులు పాల్గొన్నారు.
లైనింగ్ పనులు చేపట్టాలి..
భూ సేకరణ వేగవంతం చేసి లైనింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్ ఖుష్బూగుప్తాతో కలిసి రైల్వే అధికారులతో ఎంపీ సమీక్షించారు. మహబూబ్‌నగర్– డోన్ రైల్వేమార్గం డబ్లింగ్ పనులకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ త్వరగా చేయాలన్నారు. మహబూబ్‌నగర్ నగరంలోని టీడీగుట్ట వద్ద నూతనంగా మంజూరు చేసిన పనులు త్వరగా మొదలుపెట్టాలన్నారు. రైల్వే ద్వారా చేపట్టిన అండర్ పాస్‌లు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హరిప్రియ, ఆర్డీఓ నవీన్, రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ సంజయ్ కుమార్, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.


