● స్వల్పంగా తడిసిన మొక్కజొన్న బస్తాలు
● ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు
● ధాన్యం తడవకుండా రైతుల అవస్థలు
జడ్చర్ల/వెల్దండ/అమ్రాబాద్/లింగాల: జడ్చర్లలో మంగళవారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో అకాల వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు వీచాయి. వర్షం కురువడంతో బాదేపల్లి మార్కెట్‌లో ఆరుబయట ఉన్న మొక్కజొన్న బస్తాలు స్వల్పంగా తడిశాయి. గంగాపూర్ శివారులోని పత్తి మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి భారీగా రైతులు మొక్కజొన్నను తీసుకొచ్చారు. అయితే అక్కడ కుప్పలపై ప్లాస్టిక్ కవర్లు కప్పగా.. వర్షం కొద్దిసేపు కురువడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షం భారీగా వస్తే తడిసిపోయే ప్రమాదముండేదని, చిరుజల్లులు కురువడంతో ఎలాంటి నష్టం కలుగలే దని రైతులు తెలిపారు. త్వరితగతిన మొక్కజొన్న ను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
● వెల్దండ మండల కేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోని మొక్కజొన్న బస్తాలు మంగళవారం సాయంత్రం కురుసిన వర్షానికి తడిసిపోయాయి. ఆయా గ్రామాలకు చెందిన రైతుల నుంచి సింగిల్ విండో అధికారులు మొక్కజొన్న కొనుగోలు చేసి నిల్వ ఉంచారు. మూడురోజులుగా లారీలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం బస్తాలను నిల్వ చేశారు. కొనుగోలు కేంద్రంలో దాదాపు 6వేల బస్తాలు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం ఒక్కసారిగా వచ్చిన వర్షానికి ధాన్యం బస్తాలు వర్షంలో తడిసినట్లు అధికారులు తెలిపారు. అలాగే మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి రైతులు ట్రాక్టర్లలో మొక్కజొన్న పంటను తీసుకురాగా.. బస్తాలు అందుబాటులో లేకపోవడంతో అకాల వర్షానికి మరో వేయి బస్తాల ధాన్యం తడిసినట్లు తెలిపారు.
● లింగాల మండలంలో మంగళవారం సాయంత్రం పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గ్రామాల్లో చీకట్లు అలుముకున్నాయి. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు, లైన్లకు ప్రమాదం పొంచి ఉండడంతో విద్యుత్తు శాఖవారు ముందస్తుగా సరఫరాను నిలిపి వేశారు. దీంతో మండల వ్యాప్తంగా కొన్ని గంటలపాటు సరఫరాకు అంతరాయం కలిగింది. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు తంటాలు పడ్డారు. ధాన్యంపై కవర్లను కప్పి ఉంచారు.
● అమ్రాబాద్, పదర మండలాల్లోని పలు గ్రామాల్లో మంగళవారం గంటపాటు అకాల వర్షం కురిషింది. వర్షం రాకతో అక్కడక్కడ వేరుశనగ పంటకు నష్టం వాటిల్లింది. వేసవి దుక్కులు దున్నుకునేందుకు వర్షం సకాలంలో పడిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


