అచ్చంపేట: జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీ పాలకవర్గం పదవీ కాలం మరో 9 రోజుల్లో ముగియనుంది. మే 7 నుంచి మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు మాజీలు కానున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికలు వెంటనే నిర్వహిస్తారా.. సమయం తీసుకుంటారా.. అన్న విషయమై ఆయా రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా మున్సిపాలిటీలకు ఇవ్వాల్సిన నిధులు మంజూరు చేయకపోవడంతో ఆశించిన అభివృద్ధి జరగలేదని పాలక వర్గాల సభ్యులు నిరాశలో ఉన్నారు. మళ్లీ పోటీ చేయాలనే ఆలోచన ఉన్న వారు మాత్రమే వార్డుల్లో తిరుగుతూ.. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో చొరువ తీసుకుంటున్నారు. ఇప్పటికే అచ్చంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వు కాగా.. మొత్తం 20 వార్డు స్థానాలకు గాను 2 ఎస్టీ, 3 ఎస్సీ, 5 స్థానాలు బీసీ, 10 జనరల్‌కు రిజర్వ్ అయ్యాయి. 6 వార్డులు మహిళలకు కేటాయించారు. జడ్చర్ల మున్సిపల్ పీఠాన్ని జనరల్‌కు రిజర్వు చేశారు.
వేధిస్తున్న నిధుల కొరత
2023 జూన్ నుంచి ఆయా మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతి నిధులు రావడం లేదు. ప్రతినెలా జనాభా ప్రకారం రూ. 30 నుంచి 60లక్షలు వరకు నిధులు వచ్చేవి. అవి ఇప్పుడు నిలిచిపోవడంతో సమస్యలు పెరిగాయి. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రత్యేక నిధులు తప్ప జనరల్ ఫండ్ కార్మికుల జీతాలకే సరిపోని కారణంగా ఇతర అవసరాలకు వినియోగించుకోలేని పరిస్థితి మున్సిపాలిటీల్లో నెలకొంది.
ఎన్నికలపై కానరాని కసరత్తు
పాలకవర్గానికి మరో 9 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి కసరత్తు రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టలేదు. దీంతో మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగే అవకాశాలున్నాయి. మే 4న జరిగే మంత్రి వర్గ సమావేశంలో రాష్ట్రంలో మిగిలిపోయిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
పాలకవర్గానికి సన్మానం
అచ్చంపేట మున్సిపాలిటీ పాలకవర్గం చివరి కౌన్సిల్ సమావేశాన్ని మే 4 లేదా 5 తేదీల్లో నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కుమారుడి వివాహా వేడుకల్లో బిజీగా ఉండటంతో వచ్చే నెల మొదటి వారంలో పాలకవర్గానికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అచ్చంపేట, జడ్చర్ల మున్సిపాలిటీలోని రాజకీయ నేతల్లో కొత్తగా ఆశలు చిగురిస్తున్నాయి.
మారిన రాజకీయ ముఖచిత్రంతో..
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పాలన ప్రారంభం కావడంతో అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నర్సింహాగౌడ్‌పై 2024 జూన్12న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. బీజేపీతో కలిపి 15 మంది కౌన్సిలర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులు ఎమ్మెల్యే వంశీకృష్ణ అవిశ్వాసానికి మద్దతు తెలపడంతో.. కాంగ్రెస్ కౌన్సిలర్ గార్లపాటి శ్రీనివాసులు జూలై 6న చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. జడ్చర్ల బీఆర్‌ఎస్ మున్సిపల్ చైర్‌పర్సన్ డి.లక్ష్మిపై అదే ఏడాది సెప్టెంబరులో అవిశ్వాసం ప్రవేశపెట్టగా.. బీఆర్‌ఎస్‌కే చెందిన పుష్పలత చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
అచ్చంపేట, జడ్చర్ల ‘పుర’ పాలనకు కౌంట్‌డౌన్
9 రోజుల్లో ముగియనున్న పదవీకాలం
వచ్చే నెల మొదటి వారంలో చివరి కౌన్సిల్ సమావేశం
ఎన్నికలపై సర్వత్రా చర్చ
నిరాశలో మున్సిపల్ పాలక వర్గాలు


