‘సింగిల్‌ విండో’ల్లో సిబ్బంది అక్రమాలు | - | Sakshi
Sakshi News home page

‘సింగిల్‌ విండో’ల్లో సిబ్బంది అక్రమాలు

Apr 29 2026 7:54 AM | Updated on Apr 29 2026 7:54 AM

మేనేజర్‌ సస్పెండ్‌?

రికవరీ పేరుతో డబ్బులు స్వాహా

రైతుల ఫిర్యాదుతో వెలుగులోకి..

గండేడ్‌: కంచె చేను మేసిందనే చందంగా రికవరీ పేరుతో డీసీసీబీ, పీఏసీఎస్‌ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. రికవరీ చేసిన డబ్బును రెతుల ఖాతాల్లో జమచేయకుండా స్వాహా చేశారు. పలువురు రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. విషయం బయటకు పొక్కకుండా బాధిత రైతుల డబ్బులు సర్డుబాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి గండేడ్‌ (గండేడ్‌, మహమ్మదాబాద్‌ మండలాలు) మండలంలో పీఏసీఎస్‌తో పాటు డీసీసీ బ్యాంకుల పరిధిలో 24 పంచాయతీలతో పాటు 33 అనుబంధ గ్రామాలు ఉండగా.. రైతులకు పంట, దీర్ఘకాలిక, పీటీ ట్రేడర్స్‌ రుణాలు ఇచ్చారు.

అక్రమాలకు నెలవు..

ఆయా గ్రామాల్లో రుణాల రికవరీకి గాను బ్యాంకు సిబ్బందితో పాటు పీఏసీఎస్‌ సిబ్బంది కూడా వెళ్లేవారు. ప్రతి మార్చి నెలలో రుణాలు రికవరీ చేసి లక్ష్యం పూర్తి చేయాలనే ప్రభుత్వం సూచిస్తుండడంతో సిబ్బంది నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి రుణా లు కట్టాలంటూ ఒత్తిడి చేసేవారు. అలా వసూలు చేసిన డబ్బును బ్యాంకుల్లో రైతుల ఖాతాల్లో జమ చేయకుండా సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. గండేడ్‌ మండలంలోని కొంరెడ్డిపల్లి, గోవింద్‌పల్లి పగిడ్యాల్‌, బల్సుర్‌గొండ, రెడ్డిపల్లి, మహమ్మదా బాద్‌ తదితర గ్రామాల్లో బాధిత రైతులు ఉన్నారు.

రశీదుల్లో మాయాజాలం...

రైతుల నుంచి రుణాలు రికవరీ చేసినప్పుడు పీఏసీఎస్‌ ముద్ర, సీఈఓల సంతకాలు లేకుండా చేతితో రాసిన రశీదులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సిబ్బంది వాటిని దారి మళ్లించి, రైతుల ఖాతాల్లో నగదు జమ చేయకపోవడంతో అప్పు అలాగే ఉండిపోయింది.

గతంలో మహమ్మదాబాద్‌ డీసీసీబీ మేనేజర్‌గా పనిచేసిన వ్యక్తి బదిలీపై పక్క మండలానికి వెళ్లాడు. ఇటీవల ఈ అక్రమాలు వెలుగు చూడడంతో సదరు మేనేజర్‌ను సస్పెండ్‌ చేసినట్లు సమాచారం. దాదాపు ఈ తతంగం జరిగి పది రోజులు గడుస్తున్నా.. విషయం బయటపడకుండా గోప్యంగా ఉంచారు. ఆయన సస్పెండ్‌ కావడంతో దాని నుంచి బయట పడేందుకు వాడుకున్న డబ్బులు సర్దుబాటు చేసినట్లు తెలిసింది. పగిడ్యాల్‌లో ఓ రైతు, జక్లపల్లిలో ఓ రైతు, కొంరెడ్డిపల్లిలో కొంతమంది రైతులు కట్టిన డబ్బులు స్వాహా చేశారు. వ్యవహరం బయటపడడంతో అధికారులు వాటిని కట్టినట్లు తెలియవచ్చింది. మిగతా వాటిని కూడ సర్దుబాటు చేసే పనిలో ఉన్నారు. దీనిపై ఉన్నతాధికారులు మరింత లోతుగా విచారణ చేస్తే డీసీసీబీ, పీఏసీఎస్‌ సిబ్బంది బాగోతం మరింత బయటపడే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement