● నేటి నుంచి ఉత్సవాలు
● హాజరుకానున్న వేలాది మంది భక్తులు
ఎర్రవల్లి: అపర మంత్రాలయంగా పేరుగాంచిన బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. బుధవారం నుంచి ఐదురోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు పంచామృతాభిషేకం, వాస్తు పూజహోమం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, బలిహరణం, రాత్రికి తెప్పోత్సవం, 30న ఉదయం పంచామృతాభిషేకం, స్వామివారి ఉపనయనం, రాత్రికి ప్రభోత్సవం, మే 1న ఉదయం పంచామృతాభిషేకం, వ్యాసపూజ, మధ్యాహ్నం సీతారాముల కల్యాణం, బలిహరణము, సాయంత్రం రథంగ హోమం, రాత్రికి కుంభం, రథోత్సవం, 2న ఉదయం పంచామృతాభిషేకం, చౌకీసేవ, ప్రభోత్సవం, 3న అమృతస్నానం, పంచామృభిషేకం, పల్లకిసేవతో ఉత్సవాలు ముగుస్తాయి.
ప్రతిరోజు ప్రత్యేక పూజలు
ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు ఉదయం 7: 30లకు ఆకుపూజ, అభిషేకం జరుగుతుంది. ప్రతిఏటా జరిగే ఉత్సవాల సమయంలో నాలుగు శనివారాల్లో కూడా (నెలరోజుల పాటు) భక్తులు స్వామివారికి దాసంగాలను సమర్పిస్తారు. ఆలయ సమీపంలో దక్షిణవాహినిగా పేరుగాంచిన పవిత్ర కృష్ణానది ఉంది. భక్తులు నదిలో పుణ్యనాలు ఆచరించి స్వామివారి దర్శనానికి వెళ్తారు. ప్రతి మంగళ, శనివారాల్లో భక్తులు అధికంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి అమావాస్య రోజు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నలుమూలల నుంచే కాక కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తారు. ప్రతి అమావాస్య నాడు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేస్తారు. అదే విధంగా దేవస్థానం వద్ద దాసంగాలు, వివాహాలు, సత్యనారాయణస్వామి వ్రతాలు, పుట్టు వెంట్రుకలు తీయుట, నామకరణం వంటి కార్యక్రమాలను అధికంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో సీతారామ కల్యాణానికి ఆలయ వ్యవస్థాపక వంశీయులు, ఎంపీ డీకే అరుణ, భరతసింహారెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబైంది.
ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
ఆంజనేయస్వామి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేసినట్లు ఆలయ ఈఓ పురందర్‌కుమార్ తెలిపారు. భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు.


