అలంపూర్: షాఅలీ పహిల్వాన్ ఉర్సును అన్ని శాఖల అధికారులు సమన్వయంతో నిర్వహించాలని తహసీల్దార్ ప్రభాకర్ అన్నారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో షాఅలీ పహిల్వాన్ ఉర్సు నిర్వాహణపై మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ ప్రభాకర్, ఎస్‌ఐ రామకృష్ణ, మున్సిపల్ చైర్మన్ పిండి జయరాముడు, ఆయా శాఖల అధికారులు, దర్గా డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు హాజరై మాట్లాడారు. మే 9 నుంచి 12వ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 9న రాత్రి గంథోత్సవం, 10న సర్ ముబారక్ దర్గాలో చిన్నకిస్తీ, 11న ధడ్ ముబారక్ దర్గాలో పెద్దకిస్తీ పోటీలు, 12న చివరి రోజు మహిళలకు ప్రత్యేక ఉర్సు ఉంటుందన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా తగు సౌకర్యాలు కల్పించాలని తహసీల్దార్ ఆయా శాఖల అధికారులను సూచించారు. మున్సిపాలిటీ అధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు, రవాణ సౌకర్యం, తాగునీటి వసతి, అత్యవసర వైద్య సేవులు, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ ముందస్తు భద్రత చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, నాయకులు, దర్గా నిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


