‘రైతులపై ప్రభుత్వ కపట ప్రేమ’ | - | Sakshi
Sakshi News home page

‘రైతులపై ప్రభుత్వ కపట ప్రేమ’

Apr 29 2026 7:54 AM | Updated on Apr 29 2026 7:54 AM

ధాన్యం కొనుగోలు చేయాలంటూ అన్నదాతల నిరసన

పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం

ఆత్మకూర్‌: రాష్ట్ర ప్రభుత్వం రైతులపై కపట ప్రేమను ఒలకబోస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, మండల కార్యదర్శి లక్ష్మీనారాయణశెట్టి అన్నారు. మంగళవారం స్థానిక గాంధీచౌక్‌లో జూరాల గ్రామానికి చెందిన రైతులు బీఆర్‌ఎస్‌ నాయకుడు శివ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా.. లారీలు రావడం లేదని, బ్యాగులు లేవని ధాన్యం కాంటా చేయకుండా చేతులెత్తేస్తున్నారని మండిపడ్డారు. అకాల వర్షాలతో ధాన్యం దిగుబడి తగ్గిందని, వచ్చిన కాస్త పంటను కాపాడుకుని తీసుకొస్తే కొనే దిక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు ఇక్కడి నుంచి కదలబోమని బైఠాయించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ జేకే మోహన్‌, ఎస్‌ఐ జయన్న ఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతల మధ్య తీవ్రస్తాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ధాన్యం కొనుగోలుకు తక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. గంట పాటు రాస్తారోకో కొనసాగడంతో వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కార్యక్రమంలో రైతులు కిష్టన్న, గోవిందు, రవి, మాసన్న తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement