స్కూల్‌ తరలించాలనడం సరైందికాదు | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ తరలించాలనడం సరైందికాదు

Apr 28 2026 8:05 AM | Updated on Apr 28 2026 8:05 AM

దేవరకద్ర: నియోజకవర్గానికి ఎంతో కృషి చేసి తెచ్చిన ఇంటిగ్రేటేడ్‌ స్కూల్‌ను తరలించాలనడం సరైంది కాదని, దీని కోసం సంతకాల సేకరణ చేసే ముందు తనను కలిస్తే వివరించేవాడినని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. 25 ఎకరాల భూమి ఎక్కడా లభించకపోవడం వల్లనే అక్కడి వాతవరణం బాగుండడంతో ఎంపిక చేశామన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఇటీవల చేసిన ఆరోపణలను ఖండిస్తూ సోమవారం ఎమ్మెల్య క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనే ఇథనాల్‌ కంపెనీ వచ్చిందని దీంతో 26 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎంపీదే ఇథనాల్‌ కంపెనీ అని దీన్ని ఆనాడే వ్యతిరేకించామన్నారు. కొల్లూరు వద్ద రూ. వంద కోట్లు పెట్టి భూమి కొన్నానని ఆరోపించడంలో నిజం లేదని, అక్కడ భూమి కొన్నట్లు నిరూపిస్తే అక్కడే వదిలేస్తానని సవాల్‌ చేశారు. తనకు కేవలం 5 ఎకరాల భూమి మాత్రమే ఉందన్నారు. ఎవరిని అక్రమ కేసులు పెట్టి బెదిరించి తీసుకోలేదని బీఆర్‌ఎస్‌కు చెందిన వారే స్వచ్ఛందంగా వచ్చి చేరితేనే తీసుకున్నామన్నారు. 2014 నుంచి 2024 వరకు ఎన్ని కేసులు పెట్టారో లెక్కతీద్దామన్నారు. సంతోష్‌రెడ్డిపై మీరే 9 కేసులు పెట్లారనే విషయం గుర్తించాలన్నారు. మా తమ్ముడిని అనవసరంగా ఇందులోకి లాగవద్దన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 50 వేల మెజార్టీతో గెలుస్తానన్నారు.ప్రజల ఆశీర్వాదంతో మరో 10 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగుతానన్నారు. సమావేశంలో మార్కెట్‌ చైర్మన్లు కథలయ్య, ప్రశాంత్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దమయంతి, టీపీసీసీ నాయకులు అరివింద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి

మహబూబ్‌ నగర్‌ న్యూటౌన్‌: ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు డాక్టర్లకు మూడు నెలల పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని, ఆస్పత్రి ఎస్‌ఆర్‌(సీనియర్‌ రెసిడెన్స్‌) డాక్టర్లకు ఆరునెలల పెండింగ్‌ ఉపకారవేతనం తక్షణమే చెల్లించాలని తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ)రాష్ట్ర కార్యదర్శి సురేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మెడికల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్‌రెడ్డితో కలిసి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రంగాఅజ్మీరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిలో ప్రభుత్వ డాక్టర్లతో సమానంగా తమ ఆరోగ్యాలు, ప్రాణాలు ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం మూడునెలల వేతనాలు పెండింగ్‌లో ఉంచడం సబబు కాదని పేర్కొన్నారు. సీనియర్‌ రెసిడెన్స్‌ సిబ్బందికి ఆరునెలలుగా స్టైఫండ్‌ పెండింగ్‌లో ఉందని, విధులకు వచ్చేందుకు కనీసం రవాణా ఖర్చులకు కూడా అప్పులు చేసే దుస్థితి నెలకొన్నదన్నారు. ఆస్పత్రిలోని ఎన్‌హెచ్‌ఎం సిబ్బందికి ఆరునెలల వేతనాలు బకాయి ఉందన్నారు. ప్రభుత్వం పెండింగ్‌ వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్‌ వైద్యులు, డాక్టర్‌ రోహిత్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement