జడ్చర్ల: ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు తదితర వ్యసనాలకు బానిసులగా మారిన ఇద్దరు యువకులు చోరీలకు అలవాటు పడి జైలుపాలయ్యారు. ఇందుకు సంబంధించి సోమవారం జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు వివరాలు వెళ్లడించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన యువకుడు అబ్దుల్‌మతిన్ ఐఐటీ సంగారెడ్డిలో ట్రాన్స్‌పోర్ట్ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తించేవాడు. అలాగే ఏపీలోని నంద్యాల జిల్లా ఎరగుడూరుకు చెందిన దేవరశెట్టి శివకృష్ణ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరు ఆన్‌లైన్ తదితర వ్యసనాలకు బానిసలుగా మారి డబ్బు కోసం ఇద్దరు చేతులు కలిపి చోరీలకు పాల్పడ్డారు. వీరు పగటి వేళల్లో పట్టణాల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి రెక్కి నిర్వహిస్తారు. చీకటి పడగానే ఆయా ఇళ్లలోకి వెళ్లి చోరీలకు పాల్పడుతారు. ఈ కోవలోనే ఈనెల 11న జడ్చర్ల వంద పడకల ఆస్పత్రి వెనుకవైపు తాళం వేసి ఉన్న ఓ ఇంటిలోకి వెళ్లి బీరువాలో ఉన్న బంగారు లాకెట్, కమ్మలు, చైన్ చోరీ చేశారు. అదేవిధంగా ఈనెల 21న హౌజింగ్‌బోర్డు కాలనీలో తాళం వేసిన ఇంటిలోకి వెళ్లి బంగారు కమ్మలు, చైన్ నగదును అపహరించారు. మహబూబ్‌నగర్ బైపాస్ సమీపంలోని ఇంటిలో 15తులాల వెండి గొలుసులు అపహరించారు. ఆయా దొంగతనాలకు సంబంధించి బాధితులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం జడ్చర్ల కొత్తబస్టాండ్ ప్రాంతంలో ఫ్‌లై ఓవర్ బ్రిడ్జి వద్ద వాహణాలను తనిఖీ చేస్తుండగా.. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం ఒప్పుకొన్నారు. వారినుంచి 5తులాల బంగారు నగలతోపాటు 15 తులాల వెండి గొలుసులను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. సమావేశంలో జడ్చర్ల సీఐ కమలాకర్, సీసీఎస్ సీఐ నాగార్జునగౌడ్, ఎస్‌ఐ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


