భోజన ఏర్పాట్లపై అసంతృప్తి | - | Sakshi
Sakshi News home page

భోజన ఏర్పాట్లపై అసంతృప్తి

Apr 28 2026 8:05 AM | Updated on Apr 28 2026 8:05 AM

జడ్చర్ల టౌన్‌: జాతీయ క్రికెట్‌ చాంపియన్‌షిప్‌లో భోజన ఏర్పాట్లపై ఆయా రాష్ట్రాల కోచ్‌లు, మేనేజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో క్రీడాకారుడికి రోజుకు రూ.350 చొప్పున చెల్లిస్తున్నా సరైన భోజనం అందించడం లేదని మండిపడుతున్నారు. ముఖ్యంగా సమయపాలన లేదంటూ వాపోతున్నారు. స్వామినారాయణ గురుకులంలో బస ఏర్పాటు చేయగా జడ్చర్లలో రెండు, మహబూబ్‌నగర్‌లో మూడు మైదానాల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. భోజనాలు మాత్రం బాదేపల్లి జిల్లాపరిషత్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేశారు. బస చేసిన ప్రాంతం, మైదానం నుంచి రావడానికి బస్సులు ఏర్పాటు చేసినా సరైన సమయానికి చేరుకోలేకపోతున్నారు. అలాగే భోజనం చేసేందుకు ముందుగా క్రికెట్‌ మ్యాచ్‌లు ఉన్న జట్లను పిలవడంతో మిగిలిన జట్లు వేచి ఉండాల్సి వస్తుంది. ఈ కారణంగా మధ్యాహ్న భోజనం ఏకంగా 3 గంటలకు చేస్తుండటంతో క్రీడాకారులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. ఒకేసారి అన్ని జట్లకు భోజనం వడ్డించేందుకు ఏర్పాట్లు చేయకపోవడం విమర్శలకు దారితీస్తుంది. కొందరు క్రీడాకారులు బయటి హోటళ్లలో అల్పాహారాలు, భోజనం చేస్తున్నారు.

నార్త్‌– సౌత్‌ల మధ్య..

భోజనాలు తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో ఉండటంతో ఉత్తర భారతదేశానికి చెందిన జట్లు రుచిలేక ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ భారతదేశంలోని కొన్ని జట్లు సైతం తమ ప్రాంత భోజనం లేదంటూ వాపోతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఓ రాష్ట్రానికి చెందిన కోచ్‌, మేనేజర్లు వాగ్వాదానికి దిగారు. నిర్వాహకులు క్యాటరింగ్‌ వారితో చర్చించి రెండు ప్రాంతాలకు సరిపోయేలా భోజనం చేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement