● తీవ్రమైన కొరతతో జిల్లాలో పలుచోట్ల బంకుల మూసివేత
● అక్కడక్కడ తెరిచి ఉన్న వాటి వద్ద వాహనాల బారులు
నగరంలోని జిల్లా జైలు పెట్రోల్ బంకు వద్ద ఇలా..
పెట్రోల్ బంక్ వద్ద వాహనాల బారులు
డీజిల్ కోసం ఆగిన ప్రైవేట్ అంబులెన్స్
మహబూబ్‌నగర్ రూరల్: జిల్లాలో ఇంధన కొరత ఒక్కసారి గా తీవ్రమవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సోమవారం ఉదయం నుంచే పెట్రోల్ బంకుల వద్ద వాహనాల రద్దీ పెరిగి క్యూలు ఏర్పడగా.. గంటల తరబడి వాహనదారులు బారులుదీరారు. జిల్లావ్యాప్తంగా హెచ్‌పీ, భార త్, ఇండియన్ ఆయిల్ కంపెనీలకు చెందిన 112 బంకులు ఉండగా.. సోమవారం ఉదయం నుంచే మూతబడ్డాయి. ఇంధన కొరత మరింత తీవ్రంగా ఉంటుందన్న ప్రచారంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులుదీరుతున్నారు. సాధారణంగా ఒకటి, రెండు లీటర్లు పోయించుకునే వాహనదారులు ట్యాంకు ఫుల్ చేయించుకుంటుండటంతో బంకుల్లో ఇంధన నిల్వలు ఖాళీ అవుతున్నాయి. దీంతో మహబూబ్‌నగర్ నగరంలోని పెట్రోల్ బంకుల్లో సోమవారం ఉదయం నుంచి నోస్టాక్ బోర్డులే దర్శనమివ్వడంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. అక్కడకక్కడ తెరిచి ఉన్న బంకుల వద్ద బారులుదీరినా చివరికి దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు.
జిల్లాలో కొరత లేదు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. కలెక్టరేట్‌లోని ఆమె చాంబర్‌లో జిల్లాస్థాయి ఎనర్జీ సప్లయ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించి పెట్రోల్, డీజిల్ సరఫరాపై సమీక్షించారు. జిల్లాలో రెండు వారాల నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ స్టాక్, సరఫరా, నిల్వలపై ప్రతిరోజు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రెండు వారాల్లో కొంత సరఫరా పెరిగిందని, జిల్లాలో డిమాండ్‌కు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నట్లు ఆయిల్ కంపెనీల సేల్స్ అధికారులు వివరించారు. జిల్లాలో కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.


