అక్రమ నిర్మాణాలకు షోకాజ్‌ నోటీసులు | - | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాలకు షోకాజ్‌ నోటీసులు

Apr 28 2026 7:59 AM | Updated on Apr 28 2026 7:59 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: నగర పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వందలాది ఇంటి, బహుళ అంతస్తు భవనాల నిర్మాణం కొనసాగుతోంది. ఈ విషయమై ఈ నెల 16న ‘అతిక్రమణలు కోకొల్లలు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు పది రోజుల వ్యవధిలోనే 34 మంది ఇంటి యజమానులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో సరైన వివరాలు అందించాలని, లేనిపక్షంలో రాష్ట్ర మున్సిపాలిటీల చట్టం–2019 ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, వందలాది మంది నిబంధనలను అతిక్రమించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడితే అధికారులు కొందరికి మాత్రమే షోకాజ్‌ నోటీసులు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సమస్యలు సకాలంలో పరిష్కరించాలి

మహబూబ్‌నగర్‌ క్రైం: ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదుల్లో అధికంగా భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, సైబర్‌ మోసాలు, మహిళల భద్రతపైనే ఉంటున్నాయని వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టనున్నట్లు ఎస్పీ జానకి వెల్లడించారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆమె పోలీస్‌ అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ప్రతి ఫిర్యాదుదారుడికి సరైన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, సమస్యల పరిష్కారంలో అలసత్వం లేకుండా చూడాలన్నారు. జిల్లావాసులు తమ సమస్య లు చెప్పుకోవడానికి ప్రజావాణి ఉత్తమ వేదికగా ఉపయోగపడుతుందన్నారు. సమస్యలు సకాలంలో పరిష్కరించడం వల్ల ప్రజలకు పోలీస్‌ శాఖపై విశ్వాసం పెరుగుతుందన్నారు.

3,052 మందికి

టీబీ పరీక్షలు

పాలమూరు: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆరోగ్య శాఖలోని క్షయ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు 28 టీబీ క్యాంపులు నిర్వహించగా.. సోమవారం భూత్పూర్‌ మండలంలోని తాడిపత్రి, ఎల్కిచర్ల గ్రామాల్లో క్షయ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. తాడిపత్రిలో 105 మందికి ఎక్స్‌రే, 12 మందికి తెమడ పరీక్షలు, ఎల్కిచర్లలో 118 మందికి ఎక్స్‌రే, 8 మందికి తెమడ పరీక్షలు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 3,052 మందికి ఎక్స్‌రే, 222 మందికి తెమడ పరీక్షలు చేయగా 9 మందికి క్షయ పాజిటివ్‌ వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో టీబీ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు చేస్తున్నట్లు జిల్లా క్షయ నియంత్రణ అధికారి మల్లిఖార్జున్‌ తెలిపారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే వైద్య శిబిరాల్లో క్షయ లక్షణాలు ఉన్నవారు తప్పక పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనం

Advertisement
 
Advertisement
Advertisement