మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీనరసింహా (ఓబులేశు) స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిపారవశ్యంతో జరగనున్నాయి. ఏప్రిల్ 30 నుంచి మే 2 వరకు మూడు రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు పాల్గొననున్న దృష్ట్యా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. మొదటిరోజు ఈ నెల 30న పూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా నిర్వహించనున్నారు. మే 1న ప్రధాన ఆకర్షణగా స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా జరగనుంది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక అలంకరణలతో దేవతా మూర్తులను అలంకరించి, సంప్రదాయబద్ధంగా కల్యాణం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చివరి రోజు 2న వసంతోత్సవం, అభిషేకోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతులు, తీర్థప్రసాదాల పంపిణీ చేపట్టనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పార్కింగ్, భద్రత వంటి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు ముందుగా టికెట్లు పొందవచ్చని, విరాళాలు కూడా స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఉత్సవాలు భక్తుల విశ్వాసాన్ని మరింత బలపరుస్తాయని, ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
వైభవంగా వాసవీమాత జయంతి ఉత్సవాలు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): వాసవీమాత జయంతి ఉత్సవాలను కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆదివారం వైభవంగా నిర్వహించారు. వాసవీమాత చిత్రపటానికి కలెక్టర్ ఖుష్బూ గుప్తా పూలమాల సమర్పించారు. త్యాగ నిరతి, ధర్మ నిష్ట, సమాజ హిత భావనకు ప్రతిరూపం, ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిప్రియ, డీఆర్‌ఓ రాంరెడ్డి, డీపీఆర్‌ఓ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ సువర్జరాజ్, ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు.
నేడు ఎరువుల
దుకాణాల బంద్
జడ్చర్ల: జిల్లావ్యాప్తంగా ఎరువుల దుకాణాలను తెరవకుండా సోమవారం బంద్ పాటిస్తున్నట్లు ఎరువుల దుకాణాల డీలర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మంచని పాండయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం జిల్లా వ్యవసాయాధికారి వెంకటేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం ఎరువుల దుకాణాలను బంద్ చేసి నిరసన తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఎరువుల ఉత్పత్తిదారులు సరఫరాలపై ఎఫ్‌ఓఎల్ విధానం రవాణా చార్జీలు అమలు చేయాలన్నారు. అదేవిధంగా లింక్ ప్రొడక్ట్‌లు లేకుండా ఎరువులను సరఫరా చేయాలని, డీలర్లకు మార్జిన్ పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించే విధంగా అటు ప్రభుత్వం.. ఇటు ఉత్పత్తిదారులు చర్యలు చేపట్టాలని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్ కార్యాచరణను రూపొందించి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఫారూఖ్, ఉపాధ్యక్షుడు భరత్, కోశాధికారి విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


